KTR: మీది డబుల్‌ ఇంజినా? ట్రబుల్‌ ఇంజినా?: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ పాలనపై మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిష్ఠాత్మక మిషన్‌ భగీరథ పథకంలో

Updated : 31 Mar 2022 12:23 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ పాలనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిష్ఠాత్మక మిషన్‌ భగీరథ పథకంలో కేంద్రం భాగస్వామ్యం గురించి ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన ఎద్దేవాచేశారు. అసలు ఈ పథకంలో కేంద్రం పాత్ర ‘సున్నా’ అని  తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని కేటీఆర్‌ పేర్కొన్నారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా 2019 నుంచి రాష్ట్రంలో 38లక్షలకు పైగా ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించినట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

గుజరాత్‌ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించడాన్ని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్న గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇవ్వడం దేనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇది డబుల్‌ ఇంజినా? ట్రబుల్ ఇంజినా? అని ప్రశ్నించారు. పెట్రోల్‌, డీజిల్ ధరలు గత పది రోజులుగా పెరుగుతుండంపైనా కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ‘థాంక్యూ మోదీజీ.. ఫర్‌ అచ్చే దిన్‌’ అని ట్వీట్‌ చేశారు.

2012లో పెట్రోల్‌ ధరలు పెరగడం కాంగ్రెస్‌ ఆధ్వరంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమైందనడానికి నిదర్శమంటూ అప్పట్లో మోదీ చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ప్రస్తావించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచలేదంటూ మోదీ చేసిన మరో ట్వీట్‌ను కూడా అక్కడ జత చేశారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శలను వారికే గుర్తు చేస్తూ కేటీఆర్‌ ట్వీట్లు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని