Kumaraswamy: ‘మీరే కోమా దశలో ఉన్నారు.. ఓసారి చూస్కోండి’

అధికార భాజపాకు వ్యతిరేకంగా సెక్యులర్‌ పార్టీలన్నీ ఐక్యం కావాలని జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. దేశవ్యాప్తంగా .....

Published : 21 Apr 2022 01:55 IST

హసన్‌: అధికార భాజపాకు వ్యతిరేకంగా సెక్యులర్‌ పార్టీలన్నీ ఐక్యం కావాలని జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వసనీయతను కోల్పోయిందని హసన్‌లో మీడియాతో వ్యాఖ్యానించారు.  వచ్చే ఏడాది కర్ణాటకలో జరిగే ఎన్నికల్లోనూ హస్తం పార్టీ ఓడిపోతుందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న ఆయన.. రాష్ట్రంలో మొత్తం 225 స్థానాలకు గాను 123సీట్లు గెలుచుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. దేశంలో లౌకికశక్తులన్నీ ఏకం కావాలంటోన్న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఓటమిపాలవుతోందని ఎద్దేవాచేశారు. కర్ణాటకలోనూ కొన ఊపిరితోనే ఉందన్నారు. 

కర్ణాటకలో 2023 ఎన్నికల్లోనూ పూర్తిగా ఓడిపోతారన్నారు. దేశంలోని ప్రజలంతా తిరస్కరిస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ మతతత్వంపై ఎలా పోరాడగలుగుతుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పిన కుమార.. 123 సీట్లు సాధించి ప్రజల మద్దతుతో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ నేత సిద్ధరామయ్య జేడీఎస్‌ను పదే పదే భాజపాకు బీ టీమ్‌గా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘మీరే కోమా దశలో ఉన్నారు.. చూసుకోండి. హిజాబ్‌ అంశంపైనా మీ వైఖరిని స్పష్టంగా చెప్పలేకపోయారు. సాఫ్ట్‌ హిందుత్వ అనే మీ రహస్య అజెండా నాకు తెలుసు’’ అంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని