Telangana news: కొన్ని అంశాల్లో కేసీఆర్‌ను వ్యతిరేకించినా.. కలిసి పనిచేస్తాం: కూనంనేని

ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.

Published : 07 Oct 2022 01:28 IST

హైదరాబాద్: ప్రజాస్వామ్యం పేరుతో దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని.. దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. భాజపా విధానాలు వ్యతిరేకిస్తూ ఏర్పాటైన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్‌)కి మద్దతు ఇస్తున్నట్లు కూనంనేని వెల్లడించారు. కొన్ని అంశాల్లో సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మిగతా విధానాల్లో కలిసి పనిచేస్తామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయడం చేతకాకపోతే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.

ఈ నెల 14 నుంచి విజయవాడలో నిర్వహించబోయే సీపీఐ జాతీయ మహాసభలకు భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని.. దేశ రాజకీయాల్లో ఈ మహాసభలు కీలకం కాబోతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేయడంపై స్పందిస్తూ.. ‘‘కొందరు వామపక్ష నేతలు పూర్తిగా దిగజారిపోతున్నారు. గద్దర్ సైతం ఆ జాబితాలోకే వస్తారు’’ అని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని