ఆ వార్తలన్నీ అవాస్తవం: ప్రణబ్‌ తనయుడు

తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ తనపై వస్తోన్న వార్తలను మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్‌ ముఖర్జీ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ తోసిపుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన......

Published : 12 Jun 2021 01:36 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ తనపై వస్తోన్న వార్తలను మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ తనయుడు అభిజిత్‌ ముఖర్జీ తోసిపుచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తృణమూల్‌లో చేరతారంటూ పలు టీవీ ఛానళ్లు, కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు రావడంపై ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చిచెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లోనో.. మరే ఇతర పార్టీలోనో చేరుతున్నానంటూ వచ్చిన వార్తలు నిజం కాదని స్పష్టంచేశారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన తన మిత్రుడు జితిన్‌ ప్రసాదలా తాను కాదని చెప్పారు.

అభిజిత్‌ ముఖర్జీ గతంలో కాంగ్రెస్‌ తరఫున జంగిపూర్‌ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ ఛైర్మన్‌గానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం తాను తృణమూల్‌ భవన్‌కు దాదాపు 300కి.మీల దూరంలో జంగిపూర్‌లోని తన నివాసంలో కూర్చొని ఉన్నానని, ఎవరైనా టెలీపోర్ట్‌ చేస్తే తప్ప తాను ఈ మధ్యాహ్నమే అక్కడికి వెళ్లి పార్టీలో చేరడం అసాధ్యమంటూ వ్యాఖ్యానించారు. తన తండ్రికి సన్నిహితులైన కొందరు కాంగ్రెస్‌ మాజీ నాయకులు ప్రస్తుతం తృణమూల్‌లో ఉన్నారని, వారు టీ తాగేందుకు వచ్చిన తర్వాత ఇలాంటి ఊహాగానాలు చెలరేగినట్టు తెలిపారు. వాళ్లంతా తనకు చాలాకాలంగా తెలిసినవారేనని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని