Congress: కాంగ్రెస్‌లో చేరికల జోరు

భారాస ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కాంగ్రెస్‌ వేగం పెంచింది. ఇందులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పేవరకూ చేరికల సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది.

Published : 25 Jun 2024 03:59 IST

వేగం పెంచిన హస్తం పార్టీ
రేవంత్‌ పార్టీ కండువా కప్పేవరకూ బయటికి పొక్కని సమాచారం
సంజయ్‌కుమార్‌ చేరికతో 70కి చేరిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య!

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో కాంగ్రెస్‌ వేగం పెంచింది. ఇందులోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పేవరకూ చేరికల సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. ప్రభుత్వంలోనూ కొందరికి మాత్రమే ఈ సమాచారం ఉంటోంది. ఇది కొందరిలో కొంత అసంతృప్తికి కూడా దారితీస్తోంది. తాజాగా జగిత్యాల భారాస ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. బుజ్జగించడానికి మంత్రి శ్రీధర్‌బాబు, కొందరు ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లాల్సి వచ్చింది. 

తొలుత చర్చలు.. ఆ వెంటనే చేరికలు

కొందరు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. శాసనసభ మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు చేరడం భారాస వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. జగిత్యాల ఎమ్మెల్యేతో కాంగ్రెస్‌ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుకున్న భారాస ముఖ్య నేతలు.. ఆయనతో వెంటనే మాట్లాడటానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో ఆలస్యం కాకుండా ఆదివారం రాత్రే ముఖ్యమంత్రి సమక్షంలో సంజయ్‌కుమార్‌ చేరిపోయారు. దానికంటే ముందు జగిత్యాల ఎమ్మెల్యేతో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ వెంటనే చేర్చుకోవడం చకచకా జరిగిపోయింది. చేరికలపై ఆయా నియోజకవర్గ నాయకులతో ముందుగానే చర్చిస్తే వ్యూహం ముందుకు సాగదని, భారాస నాయకులు కూడా అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందని, గతంలోనూ ఇలా జరిగిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పోచారంతో కూడా పొంగులేటి, సుదర్శన్‌రెడ్డిలే చర్చలు జరిపినట్లు తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతోనో, రాజకీయ భవిష్యత్తు పేరుతోనో కాంగ్రెస్‌లో చేరడానికి భారాస ఎమ్మెల్యేలు కొంత మొగ్గు చూపుతున్నారన్న సమాచారం అందిన వెంటనే సంప్రదింపులు జరపడం, చేర్చుకోవడం చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రికి, మరికొందరు ముఖ్య నేతలకు తప్ప చేరికల వ్యవహారం ఇంకెవరికీ తెలియదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు భారాస యత్నం

పోచారంతో రాత్రి చర్చలు జరిగి.. ఉదయం ఆయన ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ విషయం తెలిసిన వెంటనే భారాస నాయకులు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ నాయకులతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ టచ్‌లోకి వెళ్లారని తెలిసిన వెంటనే భారాస ముఖ్య నేతలు ఆయనతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించారంటే.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి భారాస గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. తాజా చేరికలతో భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారి సంఖ్య అయిదుకు చేరింది. ఇటీవలి ఉప ఎన్నికలో కంటోన్మెంట్‌ స్థానాన్ని సైతం భారాస నుంచి కాంగ్రెస్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారు, భారాస నుంచి వచ్చి చేరినవారు కలిపి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 70కి చేరింది. భారాసలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య 33కు పడిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌.. త్వరలోనే చేరే ఎమ్మెల్యేలంటూ ఇటీవల పలువురి పేర్లు వెల్లడించారు. తాజా చేరికల నేపథ్యంలో ఏ రోజు ఎవరు హస్తం గూటికి చేరుతారోనన్న చర్చ జోరందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని