Himanta Sarma: సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి రాహుల్‌.. రాజకీయాలకు పనికిరారు!

రాహుల్‌ గాంధీ సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి అని, రాజకీయాలకు పనికిరారని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధ్యత లేకుండా అధికారం కావాలని కోరుకుంటారని ఆరోపించారు.

Published : 01 Oct 2022 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భూస్వామిలా వ్యవహరిస్తారని, సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విమర్శలు చేశారు. బాధ్యత లేకుండా అధికారం కావాలని కోరుకుంటారని, రాహుల్‌ రాజకీయాలకు సరిపోరని వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉన్న హిమంత 2015లో భాజపాలో చేరిన విషయం తెలిసిందే. కాగా జాతీయ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హిమంత మాట్లాడారు.

‘రాజకీయంగా సీరియస్‌నెస్‌ లేని వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన రాజకీయాలకు పనికిరారు. ఏపనైతే చేయకూడదో.. ఆయన అదే చేస్తున్నారు’ అని అస్సాం సీఎం అన్నారు. ‘ఓ మీటింగ్‌లో నుంచి ఉన్నట్టుండి లేచి బయటకు జాగింగ్‌కు వెళతారు. లేదా పక్కనున్న గదికి వెళ్లిపోయి అర్ధగంట తర్వాత బయటకు వస్తారు. ఆయనకు క్రమబద్ధమైన ప్రణాళిక లేదు’ అని దుయ్యబట్టారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాహుల్‌ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నారు. కానీ, ఈరోజు భారత్‌ జోడో యాత్రతోపాటు పార్టీనీ ఆయనే నడిపిస్తున్నారు. అంటే జవాబుదారీతనం లేకుండా అధికారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు కాకపోయినా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు’ అంటూ విమర్శించారు.

జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు పార్టీ విజన్‌ను తెలపడంలో పూర్తిగా విఫలమయ్యారని హిమంత దుయ్యబట్టారు. సందర్భంగా గాంధీ కుటుంబంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబానికి మాత్రమే ప్రాధాన్యం ఉన్న వాతావరణం కాంగ్రెస్‌లో ఉందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని