Updated : 22 Sep 2021 02:23 IST

Mumbai Rape Incident:  ముంబయి రేప్‌ ఘటన.. గవర్నర్‌, సీఎం మధ్య లేఖల వార్‌!

ముంబయి: మహారాష్ట్ర గవర్నర్ బీఎస్‌ కోశ్యారి‌, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల ముంబయి నగరంలోని సాకినాక ప్రాంతంలో 34ఏళ్ల మహిళపై దారుణ హత్యాచారం ఘటన విషయంలో ఇద్దరి మధ్యా ‘లేఖ’ల వార్‌ కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలంటూ గవర్నర్‌ కోశ్యారి కొద్ది రోజుల క్రితం రాసిన లేఖకు సీఎం ఘాటుగా బదులిచ్చారు. దేశంలో మహిళల భద్రత.. వారిపై పెరుగుతున్న దాడులపై చర్చించేందుకు పార్లమెంట్‌ను కూడా ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రాన్ని కోరాలంటూ గవర్నర్‌కు ప్రత్యుత్తరం పంపారు. అలాగే, గవర్నర్‌ సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ సహా  భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌... తదితర రాష్ట్రాల్లో మహిళలపై దాడులకు సంబంధించిన గణాంకాలను ప్రస్తావించారు. మహిళల భద్రత గురించి గవర్నర్‌ ఆందోళన తనకు అర్థమవుతోందని.. కానీ ఇలాంటి ఆదేశాలు కొత్త వివాదాలకు దారితీయడంతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని సీఎం పేర్కొన్నారు. 

అక్కడ రోజుకు 14మందిపై లైంగిక దాడులు!
ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారిలాగే గవర్నర్‌ కూడా డిమాండ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని లేఖలో వివరించారు. భాజపా పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్.. తదితర రాష్ట్రాల్లో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో మహిళలపై జరుగుతున్న నేరాల వివరాలను ఉద్ధవ్‌ పేర్కొన్నారు. దేవ్‌భూమిగా పిలవబడే ఉత్తరాఖండ్‌లో.. మహిళలపై దాడులు 150 శాతం పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయన్నారు. మరి అక్కడ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారా? అని ప్రశ్నించారు. పొరుగున ఉన్న భాజపా పాలిత మరో రాష్ట్రం గుజరాత్‌లో గత రెండేళ్లలో 14,229 మంది మహిళలు అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. గుజరాత్‌ పోలీసుల నివేదిక ప్రకారం రోజుకు 14 మంది మహిళలు లైంగిక దాడుల బారినపడుతున్నారన్నారు. ఇంత భారీ సంఖ్యలో మహిళలపై అకృత్యాలు జరుగుతుంటే.. గుజరాత్‌లో కనీసం నెల పాటు సెషన్‌ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అధికంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్న ఉద్ధవ్‌.. అక్కడ ప్రత్యేక సెషన్‌ కోసం భాజపా ఏ డిమాండూ చేయడం లేదన్నారు.

గతంలోనూ ఇదే తరహా వార్‌!

మరోవైపు, గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలను నామినేట్‌ చేసేందుకు మహారాష్ట్రలోని శివసేన నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి ప్రభుత్వం 12మంది పేర్లను సిఫారసు చేసింది. దీనికి గవర్నర్‌ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో ఇరువర్గాల మధ్య మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. గతేడాది కరోనా సమయంలో మూసివేసిన ప్రార్థనా మందిరాలను తక్షణమే పునఃప్రారంభించాలంటూ గవర్నర్‌ లేఖ రాస్తూ సీఎం ఉద్ధవ్‌ లౌకికవాదిగా మారారా? అని పేర్కొన్నారు. దీనిపై కూడా అప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తనకు ఎవరూ హిందుత్వ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆలయాలు తెరిస్తే హిందుత్వవాది లేకపోతే లౌకికవాది అని గవర్నర్‌ చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ బదులివ్వడం సంచలనం సృష్టించింది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని