Raghurama: అనర్హతకూ ఓ ప్రక్రియ: ఓం బిర్లా

ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై లోక్‌సభ స్పీకర్‌

Updated : 12 Jul 2021 17:00 IST

దిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రక్రియ ఉంటుందన్నారు. ముందుగానే ఇరుపక్షాలతో చర్చిస్తామని, వాదనలు విన్నాకే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్‌ తేల్చి చెప్పారు. అనర్హత పిటిషన్‌ పరిశీలన తర్వాతే సభాహక్కుల కమిటీకి పంపిస్తామన్న ఆయన.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని వ్యాఖ్యానించారు. 

ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా కరోనా ఆధారిత ప్రోటోకాల్‌ పాటించనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. కొవిడ్‌ టీకా తీసుకోని వారు పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించడానికి ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకూ 323 మంది ఎంపీలు రెండు డోసుల టీకాలు తీసుకున్నారని, ఆరోగ్య కారణాల రీత్యా 23 మంది తొలిడోసు కూడా తీసుకోలేదని స్పీకర్‌ వెల్లడించారు. పార్లమెంటు ఉభయసభలు ఉదయం 11 గంటలకు ఏకకాలంలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు 3 పార్లమెంటు సమావేశాలను కుదించగా.. శీతాకాల సమావేశాలను పూర్తిగా రద్దు చేశారు.

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుస్సాహసం: రఘురామ

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దుస్సాహసమని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. గతంలోనూ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్‌పై ఇలాగే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ‘‘ నా పై చర్యలు తీసుకోవాలంటూ అదనపు సమాచారం జోడించి స్పీకర్‌కు లేఖ ఇచ్చారు. విజయసాయిరెడ్డి తోపాటు పార్టీ ఎంపీలు ఇప్పటికి 7 సార్లు స్పీకర్‌ని కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు మాధ్యమంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారంటూ.. ఇంగ్లీష్ లో విద్యాబోధనం చేయాలని నిర్ణయించారు. తెలుగు భాషపై ప్రభుత్వం తీరు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందిమా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎలా అవుతుంది. నాపై అనర్హత వేటు వేయాలని లేఖ ఇచ్చారు. మా పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని గౌరవించినందుకు నా పై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారు. మనకు రాజ్యాంగం లేదు.. మన నాయకుడు చెప్పిందే వినాలని మీరు చెప్తారా?’’ అని రఘురామ ప్రశ్నించారు. అమరావతి రైతులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని