Ap News: పరీక్షల నిర్వహణతో లక్షల మందికి ముప్పు

దేశంలో పరీక్షలు రద్దుచేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పరీక్షల నిర్వహణ ద్వారా లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని..

Published : 23 Jun 2021 12:42 IST

ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎందే బాధ్యత
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అమరావతి: దేశంలో పరీక్షలు రద్దుచేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పరీక్షల నిర్వహణ ద్వారా లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేసి.. నిర్ణయాన్ని అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్‌ డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం పరీక్షలు రద్దు చేస్తే ముఖ్యమంత్రికి నేను రాసిన ప్రతి ఉత్తరం వెనక్కి తీసుకునేందుకు సిద్ధం. ఓ తండ్రిలా ఆలోచించి విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని రెండు నెలలుగా పోరాటం చేస్తున్నాం. మొండితనంతో 15లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదు. ఏ విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిల్లినా సీఎం జగన్‌దే బాధ్యత. దాన్ని ప్రభుత్వ హత్యగానే పరిగణించాల్సి వస్తుంది. పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోకుంటే మరింతగా ఉద్యమిస్తాం. హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పినా పరీక్షల రద్దుకు సీఎంకు మనసు రావట్లేదు’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

ఇంటర్‌, ఎంసెట్‌ పరీక్షలన్నీ ఆగస్టు నెలలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో దేనికి సిద్ధం కావాలో అర్థంకాక విద్యార్థులు, తల్లిదండ్రులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ మూడో దశ ముప్పు పొంచి ఉందని నిపుణులంతా హెచ్చరిస్తుండటంతో పాటు పిల్లలకు ఇంకా టీకాలు రానందున.. లక్షల మంది విద్యార్థులు పరీక్షల కోసం బయటకు వస్తే పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని లోకేశ్‌ నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని