Nara Lokesh: ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: రాష్ట్రపతిని కోరిన లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు.

Updated : 26 Sep 2023 18:21 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం తెదేపా ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి లోకేశ్‌ రాష్ట్రపతిని కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్‌ పాలన, ప్రతిపక్షాల అణచివేతపై రాష్ట్రపతికి వివరించారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘2019 నుంచి ఏపీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించాం. తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించారు. 45 ఏళ్లు ప్రజాజీవితంలో ఉన్న చంద్రబాబును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలుకు పంపించారని వివరించాం. మా వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ రాష్ట్రపతికి అందజేశాం. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించిన తర్వాత.. నన్ను ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఇరికించారు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో నాకేంటి సంబంధం. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు లేకపోయినా కేసు ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. దిల్లీలో ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి ఏపీలో అరాచకాలపై వివరించాం. రోజుకో వదంతి, రోజుకో కేసులతో వేధిస్తున్నారు. తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చే బాధ్యత తీసుకుంటా. ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తోంది. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కేసు పెట్టాక అధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరుతున్నారు. కక్ష సాధింపు తప్ప ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదు. నాకు, మా కుటుంబ సభ్యులకు ఒక్క పైసా రాలేదు. ఆయా కంపెనీల వద్ద ఒక కప్పు టీ కూడా తాగ లేదు’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని