Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్‌

తల్లి, చెల్లిని రోడ్డు మీదకు గెంటేసిన సీఎం జగన్‌.. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా అన్యాయం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

Updated : 31 May 2023 19:02 IST

జమ్మలమడుగు: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవగుడి క్యాంప్‌ సైట్‌ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో కంపెనీలు రాక ఉపాధి అవకాశాలు రావడం లేదని నేత కార్మికులు లోకేశ్‌కు విన్నవించారు.

‘‘చేనేత కార్మికులకు బీమా పథకాన్ని రద్దు చేశారు. నేత కార్మికులకు ఇళ్లులేక ఇబ్బంది పడుతున్నాం. షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదు. లో ఓల్టేజీ కారణంగా ఇబ్బంది పడుతున్నాం. మా ఉత్పత్తులకు నాణ్యత తగ్గిపోతోంది. అన్‌ సీజన్‌లో ఉపాధి ఉండటం లేదు. వైకాపా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు’’ అంటూ సమస్యలు ఏకరువు పెట్టారు. 

చేనేత కార్మికుల సమస్యలపై స్పందించిన లోకేశ్‌ వారికి పలు హామీలు ఇచ్చారు. ‘‘తల్లి, చెల్లిని సీఎం జగన్‌ రోడ్డు మీదకు గెంటేశారు.. తల్లి లాంటి కడప జిల్లాకు కూడా అన్యాయం చేశారు. జగన్‌ పాలనలో చేనేత కార్మికులు బాధితులే. కనీసం చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులపై సమీక్ష చేసే తీరిక కూడా జగన్‌కు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఉన్న 5శాతం జీఎస్టీ భారం పడకుండా చేస్తాం. చేనేత కార్మికులకు టిడ్కో ఇళ్లు, కామన్‌ వర్కింగ్‌ షెడ్లు ఏర్పాటు చేస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని మళ్లీ ప్రవేశ పెడతాం.

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మగ్గాల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి సాయం లేక చేనేత కార్మికులు ఇతర రంగాలకు వెళ్లిపోతున్నారు. మగ్గం ఉన్న చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తాం. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతపై ఆధారపడిన రైతులు, రంగులు అద్దే కార్మికుల దగ్గర నుంచి మాస్టర్‌ వీవర్స్‌ వరకు అందరినీ ఆదుకుంటాం’’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని