Jaya Prakash Narayana: అనర్హతే ఆయుధం కావొద్దు..అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం: జేపీ

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడంపై లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ స్పందించారు. అనర్హత ప్రధాన ఆయుధం కాకూడదని, అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని చెప్పారు.

Updated : 24 Mar 2023 18:25 IST

హైదరాబాద్‌: ప్రతి చిన్న అంశానికీ అనర్హతను ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్రమంగా క్షీణించిపోతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ (Jaya Prakash Narayana) అన్నారు. పదవి కోల్పోయిన వ్యక్తిగా రాహుల్‌ (Rahul Gandhi)కు పైకోర్టులో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందన్న ఆయన.. ఒక వేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.‘ఈనాడు-ఈటీవీ’తో ఆయన ముఖాముఖి మాట్లాడారు.. గతంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ల సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని గుర్తు చేసిన జయప్రకాశ్‌.. వాళ్ల అనర్హతపై బలమైన కారణాలున్నాయని కోర్టు తేల్చిందన్నారు. ఆ కేసులను రాహుల్‌ గాంధీ వ్యవహారంతో పోల్చడం సరికాదని చెప్పారు.

‘‘ ఏ ప్రజాప్రతినిధి అయినా ఉద్దేశం ఉన్నా లేక పోయినా, ఓ కులం పేరు చెప్పి, ఇంటి పేరు చెప్పి దూషించడం పొరపాటే. కానీ, పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు చిన్న చిన్న కారణాలకే అనర్హత వేటు వేయడం సరికాదు. అలాగైతే నూటికి 99 మంది తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. రాహుల్‌ గాంధీ విషయంలో చేసిన నేరానికి , పడిన శిక్షకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓ వ్యక్తి పదవిలో కొనసాగుతున్నప్పుడు పై కోర్టు ఖరారు చేస్తే తప్ప.. మళ్లీ ఉపఎన్నికకు దారి తీసేలా అనర్హత వేటు ప్రకటించడం మంచిది కాదు. చట్టం కూడా అదే చెప్తోంది. లోక్‌సభ అధికారులు కూడా అత్యుత్సాహంతో  అనర్హతను అమలు చేయాల్సిన అవసరం లేదు. న్యాయ నిపుణుల సలహా తీసుకొని, అవసరమైతే సుప్రీం కోర్టు సలహాకి పంపించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కీలక నాయకుల్ని సాంకేతిక కారణాలు చూపించి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి, అధికార పార్టీకి అంత మంచిది కాదు.’’ అని జేపీ అన్నారు.

రాహుల్‌ గాంధీపై అనర్హతవేటు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న ప్రశ్నకు జేపీ సమాధానమిస్తూ.. ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదని, ప్రతి అంశాన్నీ వారు క్షుణ్ణంగా గమనిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పూర్తిగా కాకపోయినా, ఎంతో కొంత దీని ప్రభావం భాజపాపై కచ్చితంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రతినిధికి రెండేళ్లకు మించి శిక్ష ఖరారైతే వెంటనే అతడిపై అనర్హత వేటు వేయవచ్చని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా లోక్‌సభ సెక్రటేరియేట్‌ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని చెప్పిన జేపీ.. ఆ స్థానంలో తాను ఉంటే కాస్త ఆలోచించి, న్యాయసలహా తీసుకొని ఉత్తర్వులు జారీ చేసేవాడినని చెప్పారు. అనర్హత వేటుపై అంత తొందరపాటు అవసరం లేదని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని