Congress plenary: భాజపాను ఓడించేందుకు ఆ పార్టీలతో పొత్తు: ఖర్గే

mallikarjun kharge on alliances: సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు భావసారుప్యం కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని కాంగ్రెస్‌ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. 

Updated : 25 Feb 2023 14:59 IST

రాయ్‌పుర్‌ (ఛత్తీస్‌గఢ్): పొత్తుల అంశంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (mallikarjun kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులతోనే 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. భాజపాను ఓడించేందుకు భావసారుప్యం కలిగిన పార్టీలతో కలవనున్నట్లు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో జరుగుతున్న 85వ పార్టీ ప్లీనరీలో (Congress plenary) శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా (BJP) సర్కారుపై విమర్శలు గుప్పించారు.

భాజపా ప్రభుత్వ హయాంలో దేశంలో రాజ్యాంగంపైనా, ప్రజాస్వామిక విలువలపై నిత్యం దాడి జరుగుతోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. మరోవైపు దేశ సరిహద్దుల్లో చైనా నుంచి ముప్పు పొంచి ఉందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించగలిగే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు భావసారుప్యం కలిగిన పార్టీతో కలిసి దేశానికి ఏవిధంగా సేవ చేశామో.. అదే తరహాలో మరోసారి అలాంటి పార్టీలతో కలిసి ప్రజావ్యతిరేక భాజపా ప్రభుత్వాన్ని సాగనంపుతామని ఖర్గే అన్నారు.

దిల్లీలో ఉన్నది పేదలకు వ్యతిరేక ప్రభుత్వం అని, అది ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పించారు. తన స్నేహితుల కోసం పనిచేస్తున్న ‘ప్రధాన సేవక్‌’గా ఆయనను పేర్కొన్నారు. వారి ప్రయోజనాల కోసమే మోదీ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు భాజపా కుట్ర చేస్తుంటే.. దేశాన్ని ఏకం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి రాజ్యాంగ విలువలపై దాడిగా ఖర్గే అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని