Published : 07 Jul 2022 01:39 IST

LPG Hike: ‘మహా’ ఖర్చులను పూడ్చుకునేందుకే గ్యాస్‌ ధరను పెంచారా?

కేంద్ర ప్రభుత్వంపై ఎన్సీపీ వ్యంగ్యాస్త్రాలు

ముంబయి: గృహ అవసరాలు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడంపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అయిన ఖర్చులను.. ఇలా ప్రజల నుంచి రికవరీ చేసుకుంటున్నారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

అంతర్జాతీయ ధరల ప్రభావంతో దేశీయంగా వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.50 పెంచుతున్నట్లు చమురు సంస్థలు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిధి మహేశ్ తపసె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఓవైపు మహా వికాస్‌ అఘాడీ కూటమి నుంచి 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మరోవైపు మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే సిలిండర్‌ ధరపై రూ.50 పెంపు. ఈ రెండింటిలోనూ యాభై ఉంది. ఈ రెండు పరిణామాలకు ఏదైనా సంబంధం ఉందంటారా? 50 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను సూరత్‌కు తీసుకెళ్లడం.. అక్కడి నుంచి గువహటికి తరలించడం.. ఆపై గోవాకి మార్చడం.. అన్ని చోట్లా ఖరీదైన హోటళ్లలో వారికి వసతి కల్పించడం.. ఈ మొత్తం ఆపరేషన్‌ వెనుకేదో అదృశ్య శక్తి (భాజపాను ఉద్దేశిస్తూ) ఉంది. ఆ శక్తి ఈ ఎమ్మెల్యేలపైనే భారీగానే ఖర్చు చేసింది. ఇదంతా జరిగిన కొద్ది రోజులకే వంటగ్యాస్‌ ధరలు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదంతా.. ‘మహా’ ప్రభుత్వాన్ని కూల్చడానికి చేసిన ఖర్చును పూడ్చుకోడానికేనా?’’ అని ఎన్సీపీ ప్రశ్నించింది. మహారాష్ట్రలో ఇంధన ధరలను తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పారని, కానీ మరుసటి రోజే వంట గ్యాస్‌ ధరలు పెరిగాయని ఎన్సీపీ దుయ్యబట్టింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts