Mallikarjun Kharge : ఆ కెమెరాల్లో మమ్మల్ని కూడా చూపించండి.. రాజ్యసభ ఛైర్మన్‌కు ఖర్గే అభ్యర్థన!

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల (special session of the Parliament) సందర్భంగా కాంగ్రెస్‌ (Congress) జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 18 Sep 2023 16:01 IST

దిల్లీ : పార్లమెంటు సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల్లో ప్రతిపక్ష సభ్యులు కూడా కనిపించేలా చూడాలని కాంగ్రెస్‌ (Congress) జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు (Jagdeep Dhankhar) విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (special session of the Parliament) జరుగుతున్న నేపథ్యంలో తొలి రోజు ఖర్గే మాట్లాడారు. సభలో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశాలు ప్రతిపక్ష సభ్యులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడే సమయంలో కెమెరాలు వారిని చూపించడం లేదనే విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘మాకు బయట అవకాశం దొరకదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడైనా అవకాశం కల్పించండి’ అని ఖర్గే కోరారు.

ఎంతో ప్రయాసతో తెలంగాణ ఏర్పాటు: లోక్‌సభలో ఏపీ విభజనను ప్రస్తావించిన మోదీ

ఇక్కడ ప్రస్తావించిన విషయాలు బయటకు వెళితే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతోందనే సందేశం వెళ్తుంది. అందుకే ఎంపీలు చేసే ‘రాజ్యాంగ పరమైన పనిని’ రాజ్యసభ ఛైర్మన్‌, ప్రభుత్వం ప్రోత్సహించాలని ఖర్గే సూచించారు. సభకు ఛైర్మనే రక్షకుడని.. ఇక్కడ మాకు ఏదైనా అన్యాయం జరిగితే రక్షించాల్సిన బాధ్యత ఆయనపైనే ఉంటుందని చెప్పారు. ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు తక్కువ మందే ఉన్నా..  అధికార పక్షం దాడి చేస్తే మీ వద్దనే మొరపెట్టుకోగలమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఖర్గే ఓ హిందీ పద్యాన్ని చదివి వినిపించారు. 

‘‘మీరేదైనా మార్చాలని భావిస్తే.. పరిస్థితిని మార్చండి
ఇలా పేర్లు మార్చడం వల్ల సాధించేది ఏమిటి?

మీరేదైనా ఇవ్వాలని భావిస్తే.. యువతకు ఉద్యోగాలు ఇవ్వండి
అందరినీ నిరుద్యోగులుగా చేయడం ద్వారా మీరు సాధించేది ఏమిటి?

మీ మనసు కాస్త పెద్దది చేసుకోండి
మనుషులను చంపడం వల్ల సాధించేది ఏమిటి?

మీరు ఏమీ చేయలేకపోతే అధికార పీఠాన్ని విడిచిపెట్టండి
ఒకరినొకరు భయపెట్టుకోవడం ద్వారా సాధించేది ఏమిటి? 

మీ పాలన చూసి మీరు గర్వపడుతున్నారు
ప్రజలను బెదిరించడం ద్వారా ఏమి సాధిస్తారు?’’

నిర్మాణాన్ని నిలబెట్టే బలమైన పునాది రాళ్లు ఎవరికీ కనిపించవనీ.. గోడపై ఉండే పేరు మాత్రమే అందరికీ కనిపిస్తుందని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ‘బలమైన ప్రతిపక్షం లేకపోవడం అంటే వ్యవస్థలో గణనీయమైన లోపాలున్నాయని నెహ్రూ నమ్మేవారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం సరికాదు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టే ఈడీ, సీబీఐని ప్రయోగించి బలహీన పరుస్తున్నారు. కేసులతో భయపెట్టి ఎంపీలను అధికార పార్టీలోకి లాక్కొంటున్నారు. వారిని తమ వాషింగ్ మెషీన్లలో వేసి మరకలేని వ్యక్తుల్లా బయటకు తీసుకొస్తున్నారు. ఆ తర్వాత తమ పార్టీలోనే శాశ్వతంగా కొనసాగేలా చూస్తున్నారని’ ఖర్గే విమర్శించారు. 

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ఖర్గే సభలో ప్రస్తావించారు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ నెహ్రూ 14 ఏళ్లు జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు నూతన పార్లమెంటు భవనంలోకి వెళ్లడం వల్ల కొత్తగా జరిగేది ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటులో మాట్లాడుతూ నెహ్రూ గురించి రెండు సార్లు మాత్రమే ప్రస్తావించారన్నారు. నెహ్రూ సేవలను కొనియాడుతూ గతంలో మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 21 సార్లు, మన్మోహన్‌ సింగ్‌ 30 సార్లు ప్రకటనలు చేశారని చెప్పారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని