Telangana News: రేవంత్‌.. మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం: మధుయాష్కీ

రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని..

Published : 27 May 2022 01:39 IST

హైదరాబాద్: రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని.. పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించేలా ఉన్నాయ‌ని పీసీసీ ప్రచార క‌మిటీ ఛైర్మన్ మ‌ధుయాష్కీ గౌడ్ అన్నారు. రేవంత్‌ వ్యాఖ్యల‌పై తీవ్రంగా స్పందించిన మ‌ధుయాష్కీ.. రేవంత్‌రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు.

‘‘రేవంత్ రెడ్డి వ్యాఖ్యల‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్ని వర్గాల కలయికే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వ్యక్తి కంటే వ్యవ‌స్థ, పార్టీ ముఖ్యం. గతంలో రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన నేతలను సైతం ఇందిరా గాంధీ అక్కున చేర్చుకున్నారు. కొత్తగా పార్టీలోకి వ‌చ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష ప‌ద‌వి, నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చొరవ వల్లే ఈ పదవులు దక్కాయి. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతిలో బలహీన వర్గాలు బలవుతున్న విషయాన్ని గ్రహించిన‌ సోనియా గాంధీ.. ప్రత్యేక‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని అధికారంలోకి వ‌చ్చిన‌ కేసీఆర్.. ఆయా వ‌ర్గాల‌ను మోసం చేశారు.

వరంగల్ డిక్లరేషన్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు వస్తున్న స‌మ‌యంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడి ఉంటే పీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ఉంటే.. ఎందుకు పార్టీ ఓట‌మి పాలైంది?బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇత‌ర మైనార్టీ వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి లాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి’’ అని మధుయాష్కీ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని