Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమి బలపరీక్ష ఎదురైంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర

Updated : 29 Jun 2022 16:51 IST

మెజార్టీ నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశం

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ కూటమికి బలపరీక్ష ఎదురైంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. ఇందుకోసం రేపు(జూన్‌ 30) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తిచేయాలని గవర్నర్‌ సూచించారు. దీన్ని రికార్డ్‌ చేయాలని ఆదేశించారు.

నిన్న రాత్రి భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ను కలిశారు. బలపరీక్షకు సీఎంను ఆదేశించాలని కోరారు. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారనీ, సర్కారు మైనారిటీలో పడిందని రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌.. బలాన్ని నిరూపించుకోవాలని ఠాక్రే సర్కారును ఆదేశించారు.

సుప్రీంకోర్టుకు ఠాక్రే సర్కారు..

అయితే బలాన్ని నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలపై ఠాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై సీఎం ఠాక్రే తమ న్యాయ బృందాన్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. దీనిపై వారు నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశముంది.

రేపు ముంబయికి శిందే వర్గం..

మరోవైపు, గువాహటిలో ఉన్న ఏక్‌నాథ్‌ శిందే ఈ ఉదయం స్థానిక కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు తామంతా ముంబయికి తిరిగి వెళ్లనున్నట్లు తెలిపారు. శివసేన పార్టీలో 2/3 వంతుల మెజార్టీని నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు శిందే ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. శిందే వర్గం ఎమ్మెల్యేల కోసం ముంబయి, గోవాల్లో హోటల్‌లు బుక్‌ అయినట్లు తెలుస్తోంది. బలపరీక్ష నేపథ్యంలోనే అసమ్మతి నేతల్లో కొంతమందిని గోవా తరలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

అసెంబ్లీలో పార్టీల బలాబలాలిలా..

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గాను ప్రస్తుతం 287 మంది సభ్యులున్నారు. అధికార మహా వికాస్‌ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలం ఉంది. విపక్ష భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే శివసేనపై తిరుగుబాటు చేసిన శిందే.. తన వెంట 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. దీంతో పాటు కొందరు స్వతంత్రులు కూడా మద్దతిస్తున్నారని తెలిపారు.

శివసేన అసమ్మతి నేతలు 39 మంది రేపు సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. అంటే ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం మహా వికాస్‌ అఘాడీ కూటమి సంఖ్యా బలం 113 మాత్రమే. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని