Maharashtra: ‘మహా’ సంక్షోభంలో మరో మలుపు.. రెబల్‌ మంత్రుల శాఖలు వెనక్కి

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గం.. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు

Published : 27 Jun 2022 14:22 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ శిందే వర్గం.. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శిందే సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఠాక్రే సర్కారు అసెంబ్లీలో మైనార్టీలో పడినట్లయింది. ఇదిలా ఉండగా.. తిరుగుబాటు చేసిన మంత్రులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో ఏక్‌నాథ్‌ శిందే సహా 9 మంది మంత్రులున్నారు. వీరంతా గువాహటిలోని హోటల్‌లో ఉన్నారు. కాగా.. ఈ 9 మంది మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహా సీఎంవో కార్యాలయం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాలనా వ్యవహారాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో వీరి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించినట్లు సీఎంవో కార్యాలయం వెల్లడించింది. ఏక్‌నాథ్‌ శిందే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ శాఖలను సుభాశ్‌ దేశాయ్‌కి అప్పగించారు. ఉదయ్‌ సామంత్‌ మంత్రిగా ఉన్న ఉన్నత, సాంకేతిక విద్యాశాఖను ఆదిత్య ఠాక్రేకు బదలాయించారు. ప్రస్తుతం ఠాక్రే కేబినెట్‌లో కేవలం నలుగురు మంత్రులు మాత్రమే ఉండటం గమనార్హం. వీరిలో ఆదిత్య ఠాక్రే మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్సీలే.

శిందేపై హైకోర్టులో పిటిషన్‌..

మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తోన్న ఏక్‌నాథ్‌ శిందేకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో శిందే రాజకీయ గందరగోళం సృష్టించి.. ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఏడుగురు పౌరులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రెబల్‌ ఎమ్మెల్యేలు తమ ప్రమాణాలను ఉల్లంఘించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే వారు రాష్ట్రానికి తిరిగొచ్చి, వారి బాధ్యతలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై తక్షణ విచారణ చేపట్టాలని పిటిషన్‌దారులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని