Maharashtra: గోవాకు రెబల్‌ ఎమ్మెల్యేలు.. సుప్రీంలో మొదలైన విచారణ.. ఠాక్రే కేబినెట్‌ భేటీ

మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మరింత వేడెక్కుతున్నాయి. ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ బలపరీక్ష ఎదర్కోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారు.

Published : 29 Jun 2022 17:31 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మరింత వేడెక్కుతున్నాయి. ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ బలపరీక్ష ఎదర్కోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారు. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ఠాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. దీంతో ఠాక్రే ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌.. ఈ సాయంత్రం 5 గంటలకు విచారణ ప్రారంభించింది.

మహా సర్కారు తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. నిన్న రాత్రి ప్రతిపక్ష నేత గవర్నర్‌ను కలిశారని, ఈ భేటీ జరిగిన కొద్ది గంటలకే బలపరీక్ష గురించి ఆదేశాలు వచ్చాయని ఠాక్రే సర్కారు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు ఎన్సీపీ సభ్యులు కొవిడ్‌తో బాధపడుతున్నారని, మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించడం సరికాదని అభిప్రాయపడింది. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.

గువాహటి వీడిన రెబల్స్‌

ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా అస్సాంలోని గువాహటి హోటల్‌లో ఉన్న శిందే వర్గం ఈ సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరింది. శిందే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానాల్లో బయల్దేరారు. అయితే వీరు ముంబయికి వెళ్తున్నారా? లేదా గోవా వెళ్తున్నారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గోవాలో ఇప్పటికే వీరి పేర్లపై హోటల్‌కు బుక్‌ అయినట్లు తెలుస్తోంది.

ఠాక్రే కేబినెట్‌ భేటీ..

మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నేడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రాలయలో ఈ కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. ఏకకాలంలో మూడు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని