Maharashtra: నేడే మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ..!

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన మంత్రిమండలిని (Maharashtra cabinet) విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆగస్టు 9 (మంగళవారం)న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

Updated : 09 Aug 2022 00:52 IST

దిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే తన మంత్రిమండలిని (Maharashtra cabinet) విస్తరించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఆగస్టు 9 (మంగళవారం)న ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని భాజపాకు చెందిన ఓ సీనియర్‌ నేత వెల్లడించారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. మహారాష్ట్ర మంత్రిమండలిపై ఇప్పటికే కసరత్తు పూర్తికాగా.. తొలుత 15 మందిని మంత్రులుగా తీసుకోనున్నట్లు సమాచారం.

శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఉద్ధవ్‌ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేయడంతో జూన్‌ 30న శిందే, ఫడణవీస్‌లు మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరితోనే మహారాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతోంది. కేవలం ఇద్దరు మంత్రులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తుండడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పాటుపై ఏక్‌నాథ్‌ శిందే, దేవేంద్ర ఫడణవీస్‌లు ఇప్పటికే పలుమార్లు దిల్లీ వెళ్లి భాజపా అగ్రనాయకత్వంతో చర్చలు జరిపారు. చివరకు ఆగస్టు 9న కేబినెట్‌ విస్తరణకు సిద్ధం కాగా.. దేవేంద్ర ఫడణవీస్‌కు హోంమంత్రి బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం మరింత మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని