Maharashtra: ఇప్పటి వరకు ఇద్దరే మంత్రులు.. ఇకపై ఎందరో?

ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మంత్రులతోనే నడుస్తున్న మహారాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ సిందే నిర్ణయించారు. అయితే, ఎప్పుడనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.

Published : 25 Jan 2023 01:17 IST

ముంబయి: అనూహ్య రీతిలో మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. అయితే కచ్చితంగా ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గతేడాది శివసేన నుంచి విడిపోయిన తర్వాత.. మహావికాస్‌ అఘాడీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని శిందే కూల్చివేశారు. ఆ తర్వాత తన వర్గంలోని ఎమ్మెల్యేలతోపాటు భాజపా మద్దతుతో జూన్‌ 30న సీఎం పీఠాన్ని అదిష్ఠించారు. ప్రమాణస్వీకారోత్సవంలో శిందేతోపాటు కేవలం దేవేంద్ర ఫడణవీస్‌ మాత్రమే  ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మిగతా మంత్రుల్ని మాత్రం నియమించలేదు. అప్పటి నుంచి దాదాపు 20 శాఖలను వీరిద్దరే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతుండటంతో తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారన్నదానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకవేళ భాజపాకి కీలక శాఖలను కేటాయించినట్లయితే సొంత వర్గం నుంచే శిందేకు వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో సమీకరణాలు ఎలా మారుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే చిత్రాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ భవనంలో సోమవారం ఏర్పాటు చేశారు. దీనిని సీఎంఏక్‌నాథ్‌ శిందేతోపాటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభాపతి రాహుల్‌ నర్వేకర్‌, శాసనమండలి ఉపసభాపతి నీలం గోర్హే, ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌, ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాక్రే, కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే తదితరులు హాజరయ్యారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని