Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్‌ శిందే..

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో మెజార్టీ మార్క్‌(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా

Updated : 04 Jul 2022 12:17 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్ష (Trust Vote)లో మెజార్టీ మార్క్‌(144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు శిందే సర్కాకుకు మద్దతుగా ఓటేశారు. దీంతో బలపరీక్షలో సీఎం నెగ్గినట్లు స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ప్రకటించారు.

ఈ ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే భాజపా, శివసేన నేతల ప్రతిపాదన మేరకు స్పీకర్‌ విశ్వాస పరీక్ష చేపట్టారు. తొలుత మూజువాణీ ఓటు ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేశారు. అయితే డివిజన్‌ ఆఫ్‌ ఓట్‌ పద్ధతిలో బలపరీక్ష చేపట్టాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. ఇందుకు అంగీకరించిన సభాపతి.. డివిజన్‌ ఆఫ్‌ ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. శిందేకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు లేచి నిలబడగా.. అసెంబ్లీ సిబ్బంది లెక్కింపు చేశారు. శిందేకు మద్దతుగా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 99 మంది వ్యతిరేకంగా ఓటెయ్యగా.. ముగ్గురు ఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

బలపరీక్షకు ముందు శిందే గూటికి మరో ఎమ్మెల్యే..

కాగా.. విశ్వాస పరీక్షకు కొద్ది సేపటి ముందు ఠాక్రే వర్గానికి మరో షాక్‌ తగిలింది. మరో శివసేన ఎమ్మెల్యే ఒకరు శిందే వర్గంలో చేరారు. హింగోలీ జిల్లా కలమ్నూరి నియోజకవర్గ ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ శిందే వర్గంలో చేరుతున్నట్లు ప్రకటించారు. అనంతరం విశ్వాస పరీక్షలోనూ సంతోష్‌.. శిందేకు అనుకూలంగా ఓటేశారు.

ప్రతిపక్షాల ‘ఈడీ’ నినాదాలు..

విశ్వాస పరీక్షలో సంతోష్‌.. శిందేకు మద్దతుగా నిలబడగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ‘ఈడీ.. ఈడీ’ అంటూ నినాదాలు చేశారు. శిందే వర్గానికి చెందిన ప్రతాప్‌ సర్‌నాయక్‌ ఓటేసినప్పుడు కూడా ఇలాంటి నినాదాలే చేశారు. ఈడీ దర్యాప్తులకు భయపడే శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు ఠాక్రే వర్గం మొదట్నుంచీ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతాప్‌ సర్‌నాయక్‌ కూడా ఓ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.

మరోసారి సుప్రీంకోర్టుకు ఠాక్రే వర్గం..

ఇదిలా ఉండగా.. మహా అసెంబ్లీ నూతన సభాపతి నర్వేకర్‌ నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన సభాపక్ష నేతగా ఉన్న అజయ్‌ ఛౌదరిని తొలగించి.. ఆయన స్థానంలో సీఎం ఏక్‌నాథ్‌ శిందేను తిరిగి నియమించారు. చీఫ్‌ విప్‌ పదవిలోనూ శిందే వర్గ ఎమ్మెల్యేను నియమించారు. అయితే చీఫ్‌ విప్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. అసమ్మతి ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిసి ఈ పిటిషన్‌ను కూడా జులై 11వ తేదీనే విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని