Maharashtra: శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ చీలిక దిశగా సాగుతుండగా.. తాజాగా

Published : 29 Jun 2022 02:39 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ చీలిక దిశగా సాగుతుండగా.. తాజాగా 14 మంది ఎంపీలు కూడా రెబల్స్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శివసేన పార్టీకి లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 14 మంది ఏక్‌నాథ్‌ శిందే, భాజపాతో టచ్‌లో ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. వీరంతా శిందే వర్గంలో చేరే అవకాశాలున్నట్లు సమాచారం. అదే నిజమైతే, శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తోన్న శిందేకు మరింత బలం చేకూరినట్లవుతుంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులున్నారు. వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి శిందే నాయకత్వం వహిస్తున్నారు. దీంతో అసలైన శివసేన పార్టీ తమదేనని, అసెంబ్లీలో తమ వర్గాన్నే శివసేనగా గుర్తించాలని శిందే కోరుతున్నారు. ఇదే విషయమై త్వరలోనే ఆయన గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎంపీలు కూడా శిందేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేడు ఠాక్రే కేబినెట్‌ భేటీ..

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ కూడా పాల్గొననున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వాన్ని కొనసాగించే విషయంలో ఠాక్రే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

దిల్లీకి ఫడణవీస్‌.. శిందేను కలిసే అవకాశం

ఇదిలా ఉండగా.. రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ దిల్లీ వెళ్లారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చిచేందుకు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. అంతేగాక, ఆయన ఏక్‌నాథ్‌ శిందేతోనూ భేటీ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శిందే గువాహటి హోటల్‌లో ఉండగా.. రెబల్‌ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం ఆయన కూడా దిల్లీ వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని