Maharashtra crisis: సుప్రీంకు చేరిన ‘మహా’ పంచాయితీ.. పిటిషన్ దాఖలు చేసిన రెబల్స్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందేను కాకుండా.......

Published : 27 Jun 2022 01:29 IST

దిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్‌నాథ్‌ శిందేను కాకుండా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సూచించిన వ్యక్తిని గుర్తించడం పట్ల శిందే సారథ్యంలోని రెబల్‌ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో పాటు శివసేన (Shivsena) తరఫున శాసనసభా పక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) క్యాంపు సవాలు చేసింది. కేవలం 15 మంది మద్దతున్న వ్యక్తి పార్టీ శాసనసభా పక్షనేత కాలేరని పేర్కొంది.

శాసనసభ్యులుగా అనర్హతకు సంబంధించి ఇచ్చిన నోటీసులకు జూన్‌ 27వ తేదీ సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా సమాధానమివ్వాలని తిరుగుబాటు నేత శిందే సహా 16 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ శనివారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంలో సవాలు చేశారు. అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని తిరుగుబాటుదారులు సుప్రీంకోర్టును కోరారు. తమకు మరింత సమయం ఇవ్వాలన్నారు. తమ కుటుంబాలకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా వారు కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్​ను జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జేబీ పర్దివాలా సభ్యులుగా గల బెంచ్ సోమవారం పరిశీలించే అవకాశం ఉంది.

ఏక్‌నాథ్‌ వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడే సూచనలు కనిపించడం లేదు. గువాహటిలో మకాం వేసి న రెబెల్‌ ఎమ్మెల్యేలు మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. అసమ్మతి సభ్యుల భార్యలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. వారి భర్తల్ని ఎలాగైనా రాజీ చేయాలని ఆమె కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్ధవ్‌ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని