Sanjay Raut: అలాంటి నేతల వల్లే దేశ ప్రతిష్ఠ దిగజారుతోంది.. సంజయ్‌ రౌత్‌ విమర్శలు

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు విషపూరితమైపోయాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌(Sanjay Raut) ఆందోళన వ్యక్తంచేశారు.

Published : 14 Nov 2022 01:06 IST

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులు విషపూరితమైపోయాయని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌(Sanjay Raut) ఆందోళన వ్యక్తంచేశారు. ఒకరినొకరు నాశనం చేసుకుంటుండటంతో రాజకీయ వాతావరణమే కలుషితమైపోయిందని  ఆవేదన వ్యక్తంచేశారు. మనీలాండరింగ్‌ కేసులో ఆగస్టులో ఈడీ ఆయన్ను అరెస్టు చేయగా.. నవంబర్‌ 9న జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే, శివసేన ఉద్ధవ్‌ వర్గం అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న రౌత్‌.. ఆదివారం నాటి తన కాలమ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో విద్వేష భావనలు వచ్చేశాయని.. రాజకీయ నాయకులు ఇప్పుడు తమ ప్రత్యర్థులు ప్రాణాలతో ఉండరాదనే స్థాయికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 

మహారాష్ట్రలో ఒకరినొకరు నాశనం చేసుకుంటుండంతో అక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా కలుషితమైపోయిందన్న సంజయ్‌ రౌత్‌.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఇప్పుడు లేవు.. అవి కేవలం రెండు పేర్లుగానే మిగిలిపోయాయన్నారు. రాజకీయాలు విషపూరితమైపోయాయని.. బ్రిటిష్‌ హయాంలోనూ ఇలా లేదన్నారు. దిల్లీ పాలకులు తాము కోరుకున్నదే వినాలనుకొంటున్నారని.. అలా చేయని వారిని శత్రువుల్లా చూస్తున్నారని రౌత్‌ ఆరోపించారు.  దేశంలో ఎవరైతే వాస్తవాలు మాట్లాడతారో, ముక్కుసూటితనంతో వ్యవహరిస్తారో వాళ్లనే శత్రువుల్లా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. తద్వారా అలాంటి రాజకీయ నాయకుల వల్ల దేశ ప్రతిష్ఠ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని