Basavaraj Bommai: కర్ణాటక రాజకీయాలపై బొమ్మై కీలక వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ బసవరాజ్‌ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని వ్యాఖ్యానించారు. 

Published : 20 Jun 2024 22:34 IST

దావణగిరె : కర్ణాటక రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ బసవరాజ్‌ బొమ్మై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. చివరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే అధిష్ఠానంపైకి తిరగబడే పరిస్థితులు తలెత్తాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలను నిధుల కొరత వెంటాడుతోందని, ప్రజల ముందుకు వెళ్లాలంటేనే వాళ్లు భయపడుతున్నారని విమర్శించారు. పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆయన.. ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే, రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వం అధికారంలో ఉందా? లేదా? అనే సందేహం కలుగుతుందని దుయ్యబట్టారు.

‘‘ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అసహనం పెల్లుబుకుతోందన్న మా పార్టీ ఎంపీ గోవింద్‌ కర్జోల్‌ వ్యాఖ్యల్లో నిజముంది. ఆయన భాజపాలో సీనియర్‌ నేత. చాలా ఏళ్ల రాజకీయ అనుభవముంది. ఆయన అసత్య ఆరోపణలు చేయలేదు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే మాట్లాడారు’’ అని బొమ్మై తెలిపారు. అంతకుముందు దావణగిరె భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరలు అమాంతం పెంచేస్తూ.. పేద, సామాన్య ప్రజలపై తలకు మించిన భారం మోపుతోందని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ తదితర ధరలను పెంచేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కోల్పోయిందని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని