Bihar politics: నీతీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయాలని అడిగారు: భాజపా ఆరోపణ

ఎన్డీయేతో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌ కుమార్‌పై కమలనాథులు మండిపడుతున్నారు. ......

Published : 11 Aug 2022 01:15 IST

పట్నా: ఎన్డీయేతో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌ కుమార్‌పై కమలనాథులు మండిపడుతున్నారు. ఆయన ఆర్జేడీని సైతం నట్టేట ముంచుతారని, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకొని ఆ పార్టీని చీల్చేందుకు ప్రయత్నిస్తారని భాజపా ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ ఆరోపించారు. అంతేకాకుండా, నీతీశ్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తే తాను బిహార్‌ ముఖ్యమంత్రి కావొచ్చన్న ఆఫర్‌తో కొందరు జేడీ(యు) నేతలు తన వద్దకు వచ్చి కలిశారని వెల్లడించారు. గతంలో నీతీశ్‌ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్‌ కుమార్‌ మోదీ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా  రాష్ట్రంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘జేడీ(యు) నేతలు నా వద్దకు ఒక ప్లాన్‌తో వచ్చారు. నీతీశ్ ఉపరాష్ట్రపతిగా దిల్లీకి వెళ్తే.. మీరు బిహార్‌ సీఎం కావొచ్చని ఆఫర్‌ చేశారు’’ అని ఆరోపించారు. అయితే, ఆయన చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు జేడీ(యు) నేతలెవరూ స్పందించలేదు. 

‘‘నీతీశ్‌ తన తీరుతో ప్రధాని నరేంద్ర మోదీని, బిహార్‌ ప్రజల్ని అవమానించారు. ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని సైతం నీతీశ్ అవమానించారు. కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూడాలనుకొంటున్నాం. వచ్చే ఎన్నికలకు ముందే ఈ ప్రభుత్వం పడిపోతుంది. మహారాష్ట్రలో శివసేనలో చీలికకు మేం ప్రయత్నించలేదు. నీతీశ్ ఆర్జేడీని నట్టేట ముంచుతారు’’ అని సుశీల్‌ కుమార్‌ మోదీ వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని