‘కుటుంబం నుంచి ఒక్కరే.. చట్టం చేయండి’

వారసత్వ రాజకీయాలపై భాజపా చేసే విమర్శలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి వచ్చేలా....

Updated : 25 Jan 2021 12:40 IST

భాజపాకు సవాల్‌ విసిరిన మమత బెనర్జీ మేనల్లుడు

కోల్‌కతా: వారసత్వ రాజకీయాలపై భాజపా చేసే విమర్శలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లోకి వచ్చేలా చట్టం చేయాలని సవాల్‌ విసిరారు. కైలాష్‌ విజయవర్గీయ, సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌, రాజ్‌నాథ్‌.. ఇలా చాలా మంది భాజపా నాయకుల కుటుంబాలు రాజకీయాల్లో ఉన్నాయని వెల్లడించారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరినే రాజకీయాల్లోకి అనుమతిస్తూ చట్టం చేస్తే తమ కుటుంబం నుంచి మమతా బెనర్జీ ఒక్కరే రంగంలో ఉంటారని పేర్కొన్నారు. అలాంటి చట్టం తీసుకొచ్చిన వెంటనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అలాగే తనపై వస్తున్న అవినీతి ఆరోపణల్ని భాజపా నాయకులు నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటానని వ్యాఖ్యానించారు.

శనివారం విక్టోరియా మెమోరియల్‌ దగ్గర జరిగిన సభలో మమతా బెనర్జీ ప్రసంగించడానికి నిరాకరించిన ఉదంతాన్ని అభిషేక్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా చేస్తున్న కార్యక్రమంలో అలాంటి నినాదాలతో నేతాజీని అవమానిస్తే.. నిరసన తప్పదని మమత స్పష్టం చేశారని తెలిపారు. సీఎం వ్యవహరించిన తీరుతో తామంతా గర్విస్తున్నామన్నారు. జైశ్రీరాం నినాదాలు దేవాలయాలు, మతసంబంధిత ప్రదేశాల్లో మాత్రమే చేయాలని హితవు పలికారు. నేతాజీ వంటి మహనీయుల జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న కార్యక్రమంలో అలాంటి నినాదాలు చేయడం తగదని పేర్కొన్నారు.

నేతాజీ జయంతి సందర్భంగా విక్టోరియా మెమోరియల్‌ దగ్గర ప్రధానితో కలసి పాల్గొన్న సభలో మమతా బెనర్జీ ప్రసంగించడానికి నిరాకరించారు. మమతను మాట్లాడేందుకు ఆహ్వానించినపుడు జనంలోని కొందరు జైశ్రీరామ్‌ నినాదాలు చేశారు. దీంతో దీదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ కార్యక్రమానికి ఓ గౌరవం ఉంటుంది. ఇది రాజకీయ సభ కాదు. ప్రజా కార్యక్రమం. కోల్‌కతాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రధానమంత్రికి, కేంద్ర సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు. అయితే ఆహ్వానించి అవమానించడం సబబు కాదు, నేను మాట్లాడను. జై బంగ్లా, జైహింద్‌ ’’ అంటూ ముగించారు.

ఇవీ చదవండి...

నేతాజీ బాటలోనే పయనం

మోదీజీ.. జీడీపీ అదిరిందిగా!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని