Congress President Poll: చివరి నిమిషంలో పోటీలోకి ఖర్గే.. దిగ్విజయ్‌ వెనక్కి తగ్గుతారా..?

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక క్షణానికో మలుపు తిరుగుతోంది. అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లో్‌త్‌ ప్రకటించడం..

Updated : 30 Sep 2022 11:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక క్షణానికో మలుపు తిరుగుతోంది. అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించడం.. అదే సమయంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తన పోటీని ఖాయం చేయడంతో అభ్యర్థులు ఖరారైనట్లే కన్పించింది. అయితే చివరి నిమిషంలో మరో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్‌ కూడా ఖర్గేవైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్టీ హైకమాండ్‌ సూచించే ‘అధికారిక’ అభ్యర్థిగా మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఖర్గే నేడు భేటీ కానున్నారు. అనంతరం పోటీపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఆ తర్వాత నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఎన్నికకు ఎంపీలు శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పోటీ ఖాయమైతే అధినాయకత్వ పదవికి త్రిముఖ పోరు నెలకొననుంది. గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడైన ఖర్గే.. పార్టీలో అనేక కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.

ఖర్గేతో దిగ్విజయ్‌ భేటీ ఎందుకు..?

ఇదిలా ఉండగా.. అధ్యక్ష బరిలో ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ఉదయం మల్లికార్జున్‌ ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. దీంతో దిగ్విజయ్‌ పోటీ నుంచి వెనక్కి తగ్గుతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ కుటుంబం మద్దతు ఖర్గేకు ఉండటంతో దిగ్విజయ్‌ నామినేషన్‌ వేయకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే.. పోటీ ఖర్గే - శశిథరూర్‌ మధ్యే ఉంటుంది.

మధ్యాహ్నం థరూర్‌ నామినేషన్‌

అటు శశిథరూర్‌ నామినేషన్‌ పత్రాలు సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్యాహ్నం ఆయన తన నామపత్రాలను దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇక, మరో సీనియర్‌ నేత ముకుల్‌ వాస్నిక్ కూడా నామినేషన్‌ పత్రాలు తీసుకున్నారు. అయితే అధ్యక్ష పదవికి పోటీపై ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ పత్రాలు ఎవరికోసం తీసుకెళ్లారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. నామినేషన్లను సమర్పించేందుకు నేడే ఆఖరు తేదీ. ఈ సాయంత్రానికి పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాపై ఓ స్పష్టత రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని