Congress presidential poll: భాజపా చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు: మల్లికార్జున్‌ ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.

Updated : 08 Oct 2022 15:07 IST

హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకున్న ఖర్గేకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఖర్గే వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుంచి గాంధీ భవన్ చేరుకున్న ఖర్గే.. ఇందిరా భవన్‌లో పీసీసీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

భేటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. ‘‘మాలో మాకే జరుగుతున్న ఎన్నిక ఇది. ఒకే పార్టీలోని నేతల మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. భాజపా చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు. ఈనెల 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి. అధ్యక్ష బరిలో నిలిచినందున అందరి మద్దతు కోరుతున్నా. 9 వేలకు పైగా ఉన్న ఓటర్లను నేరుగా కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటించి, కాంగ్రెస్ ఓటర్లను అభ్యర్థించా. 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇది ఐదవ సారి. ఉదయ్ పూర్ చింతన్ శిబిర్‌లో తీసుకున్న డిక్లరేషన్‌ను అమలు చేస్తాను. రైతులు, యువత, మహిళా అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తాను. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయి. పబ్లిక్ సెక్టార్‌లను మోదీ అమ్మేస్తున్నారు. దీనివల్ల పేదలకు అన్యాయం జరుగుతోంది. దేశంలో నిరుద్యోగ శాతాన్ని తగ్గిస్తానని ప్రధాని మోదీ ప్రగల్భాలు పలికారు. కొవిడ్ తర్వాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగిత మరింత పెరిగింది. మోదీ పాలనలో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే రూ.82కు పడిపోయింది. దీనివల్ల పెట్రోల్‌, డీజిల్‌లతో పాటు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. పాల నుంచి మొదలుకొని చిన్న పిల్లలు వాడే పెన్సి‌ళ్లు, రబ్బర్లపైనా జీఎస్టీ వేశారు. వంట గ్యాస్‌ ధర రూ.1100 దాటింది’’ అని మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు