Congress: రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే..!..కాంగ్రెస్‌ మాట తప్పనుందా?

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఖర్గే స్థానంలో ప్రతిపక్ష నాయకుడిగా చిదంబరాన్ని ఎంపిక చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Published : 02 Dec 2022 15:42 IST

దిల్లీ: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ కీలక వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. పార్టీ అగ్రనేత చెప్పిన ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి గండి పడినట్లవుతుంది. డిసెంబరు 7 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఎవరిని కొనసాగిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం వ్యూహాత్మక కమిటీ భేటీకి పిలుపునిచ్చినట్లు సమాచారం. కేవలం మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌కు మాత్రమే ఆహ్వానం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీనియారిటీ పరంగా ఖర్గే స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యమున్న పి. చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌కు ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది.

‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధన మేరకు ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు. అయితే,  కనీసం శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకైనా ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం ఉందని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. కేవలం ఖర్గేనే కాకుండా పార్టీలో ఇద్దరు ముగ్గురు నేతలకు రెండేసి పదవులున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్న అధిర్‌రంజన్‌ చౌదురి.. పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరోవైపు సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ రాజ్యసభలో చీఫ్‌ విప్‌గానూ, కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం చీఫ్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిని కూడా ఏదో ఒక పదవికి మాత్రమే పరిమితం చేయాలన్న వాదనలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి.  పార్టీ అధ్యక్ష రేసు నుంచి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ వైదొలగడానికి ప్రధాన కారణం ఇదే.

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిపేందుకు తొలుత గాంధీ కుటుంబం అశోక్‌ గహ్లోత్‌నే ఎంపిక చేసింది. అయితే, పార్టీ నియమాల ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేస్తే.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సచిన్‌ పైలట్‌ వర్గీయులు డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో.. అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకి వచ్చింది. అయితే, తాజాగా ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కొనసాగిస్తే.. పార్టీలో మళ్లీ విభేదాలు తలెత్తే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సమావేశానికి వాళ్లు కూడా..

మరోవైపు అగ్రనేత్రి సోనియాగాంధీతో జరగనున్న వ్యూహాత్మక కమిటీ సమావేశానికి లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదురి, రాజ్యసభ చీఫ్‌ విప్‌ జైరాం రమేశ్‌, లోక్‌సభలో చీఫ్‌ విప్‌ కె.సురేశ్‌ కూడా హాజరవుతారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. వీరితోపాటు కేంద్ర మాజీ మంత్రులు పి. చిదంబరం, మనీశ్‌ తివారీ కూడా హజరయ్య అవకాశమున్నట్లు చెప్పింది. ఖర్గే కొనసాగింపు అంశంపై విభిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా చిదంబరాన్ని ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు పార్టీలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని