
మమతకు గర్వం.. సమావేశాలకు హాజరుకారు!
ఆక్షేపించిన ప్రధాని మోదీ
అసన్‌సోల్: పశ్చిమ్‌బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి గర్వం ఎక్కువని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాలకు ఏవో సాకులు చూపించి ఆమె రావడంలేదని విమర్శించారు. బెంగాల్‌లో ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అసన్‌సోల్‌లో ప్రసంగించారు. ‘మమత అహంకారిగా మారారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సమావేశాలకు ఏవేవో సాకులు చెప్పి హాజరు కావడంలేదు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే శాంతిభద్రతల్ని పునరుద్ధరిస్తాం. పారిశ్రామికీకరణ తీసుకొస్తాం. బెంగాల్‌లో అభివృద్ధి పేరుతో దోపిడీ మాత్రమే జరిగింది. మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వ్యతిరేకించారు. దీదీ నిలిపివేసిన కేంద్ర పథకాలన్నింటినీ అమలు చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.
అసన్‌సోల్ ఓ మినీ ఇండియా..
‘‘మీరు వేస్తున్న ఓట్లు తృణమూల్ కాంగ్రెస్‌ను, మాఫియా రాజ్‌ను తుడిచిపెట్టేలా ఉండాలి. అసన్‌సోల్ ఒక మినీ భారతదేశం. సైకిల్ నుంచి రైలు దాకా, కాగితం నుంచి స్టీల్ వరకు, అల్యూమినియం నుంచి గ్లాస్ వరకు తయారయ్యే కర్మాగారాల్లో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే అసన్‌సోల్ ఓ మినీ ఇండియా. దేశంలోని అన్ని మూలల ప్రజలూ ఇక్కడ కనబడతారు. దుష్పరిపాలన ఈ ప్రాంతంపై ప్రభావం చూపుతోంది’’ అని మోదీ విమర్శించారు.