Pawar- mamata: శరద్‌ పవార్‌కు మమత ఫోన్‌‌.. కీలక సలహా ఇచ్చిన దీదీ!

మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టుతో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.....

Published : 24 Feb 2022 01:45 IST

ముంబయి: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్‌ నేత నవాబ్‌ మాలిక్‌ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టుతో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆయనతో సంభాషించిన దీదీ.. తన మద్దతును తెలపడంతో పాటు సంఘీభావం ప్రకటించారు. అయితే, గతేడాది బెంగాల్‌లో నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన మంత్రులను సస్పెండ్ చేసి ఉంటే మీరేం చేసేవారని అని పవార్‌ ఆమెను అడిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి నవాబ్‌ మాలిక్‌ను తప్పించొద్దని దీదీ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఇరువురు నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 

మరోవైపు, తమ పార్టీ ముఖ్యనేత, మంత్రి నవాబ్‌ మాలిక్‌ అరెస్టుతో పలువురు ఎన్సీపీకి చెందిన మంత్రులు శరద్‌పవార్‌ నివాసంలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, మంత్రులు ఛగన్‌ భుజ్‌బల్‌, హసన్‌ ముష్రిఫ్‌, రాజేశ్ టోపె తదితరులు దక్షిణ ముంబయిలోని పవార్‌ నివాసం సిల్వర్‌ ఓక్‌లో భేటీ అయి చర్చించారు. మాలిక్‌ అరెస్టు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవేళ మాలిక్‌ రాజీనామా చేయాల్సి వస్తే ఏంచేయాలనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. కాసేపట్లో శరద్‌ పవార్‌ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసే అవకాశం ఉంది.

అలాగే, కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు, మంత్రులు బాలాసాహెబ్‌ థోరాట్‌, అశోక్‌చవాన్‌, సునీల్‌ ఖేడ్కర్‌లు కూడా పవార్‌ను కలిశారు. మాలిక్‌ అరెస్టుపై చర్చించారు. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు, మంత్రి జయంత్‌ పాటిల్‌ షోలాపూర్‌లో స్పందించారు. రాష్ట్రం గతంలో ఎప్పుడూ ఇలాంటి రాజకీయ వేధింపులను చూడలేదన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే నవాబ్‌ మాలిక్‌ను అరెస్టు చేశారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని