Mamata Banerjee: చవితి పండగ రోజునే.. దీదీ నామినేషన్‌

పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా

Published : 09 Sep 2021 01:26 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉప ఎన్నికల జోరు మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్న భవానీపూర్‌ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీదీకి పోటీగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు తృణమూల్‌ పార్టీ కూడా ప్రచారం కూడా మొదలుపెట్టింది. వచ్చే శుక్రవారం వినాయకచవితి పండగ రోజున ఉప ఎన్నికకు నామినేషన్‌ వేయనున్నట్లు దీదీ నేడు ప్రకటించారు. 

భవానీపూర్ నియోజకవర్గ పరిధిలోని చెత్లాలో బుధవారం మమతా బెనర్జీ అధ్యక్షతన టీఎంసీ కార్యకర్తల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాజపాపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. భాజపా కుట్ర వల్ల ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. ‘‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయో కేవలం ఆ దేవుడికే తెలుసు. కేంద్రం ఎన్నో అబద్ధాలు చెప్పింది. అయినా మనల్ని ఓడించలేకపోయింది. నందిగ్రామ్‌లో నాపై కుట్ర జరిగింది. బెంగాల్‌ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు 1000 మంది గూండాలను బయటి నుంచి దించారు. వారు రాజకీయంగా పోరాడలేరు. అందుకే దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది’’ అని దుయ్యబట్టారు. 

బెంగాల్‌లోని భవానీపూర్‌తో పాటు షంషేర్‌గంజ్‌, జాంగిపూర్‌ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరగనుంది. అక్టోబరు 3న ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్‌ నుంచి తృణమూల్ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ పోటీ చేసి విజయం సాధించారు. అయితే నందిగ్రామ్‌లో మమత ఓడిపోయిన నేపథ్యంలో సోభాందేవ్‌ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక  భవానీపూర్‌ నుంచి దీదీ గతంలో రెండు సార్లు విజయఢంకా మోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని