భాజపాయేతర పార్టీల నేతలకు దీదీ లేఖ

భాజపాయేతర పార్టీల కీలక నేతలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బుధవారం లేఖలు రాశారు. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన....

Updated : 31 Mar 2021 18:27 IST

దిల్లీ: భాజపాయేతర పార్టీల కీలక నేతలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బుధవారం లేఖలు రాశారు. దేశంలో భాజపాకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ లేఖ రాశారు. ప్రజాస్వామ్యంపైనా, రాజ్యాంగంపైనా భాజపా దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని, దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు. దిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలు పెంచేలా ప్రవేశపెట్టిన వివాదాస్పద చట్టాన్ని ప్రజాస్వామ్యం, సమాఖ్యపై దాడిగా పేర్కొన్నారు.  భాజపాయేతర పార్టీలు తమ రాజ్యాంగపరమైన హక్కులు, స్వేచ్ఛను వినియోగించుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను నిర్వీర్యం చేయడం ద్వారా వాటిని మున్సిపాల్టీల స్థాయికి పతనంకావాలని భాజపా కోరుకుంటోందన్నారు. అలాగే, దేశంలో ఏక పార్టీ పాలనను స్థాపించాలనుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భాజపాకు వ్యతిరేకంగా ఏకంకావాల్సిన సమయం ఆసన్నమైందని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఈ పోరాటంలో మనస్ఫూర్తిగా కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు దీదీ తన లేఖలో పేర్కొన్నారు.

దీదీ లేఖలు రాసిన వారిలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉన్నారు. సీపీఐ, సీపీఎంలను ఆమె విస్మరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని