Mamata Banerjee: తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి దీదీ..!

కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రియాంకకు మద్దతుగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Published : 22 Jun 2024 13:51 IST

తిరువనంతపురం: రానున్న లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ(Priyanka Gandhi) వయనాడ్‌(Wayanad) నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్‌(Congress)  ప్రకటించింది. ఇందులోభాగంగా ప్రియాంకకు మద్దతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) వయనాడ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో పోటీ చేసి రెండు స్థానాల్లోను భారీ మెజారిటీతో గెలుపొందారు. రెండు స్థానాల్లో గెలిచినవారు ఒక స్థానాన్ని వదులుకోవాలనే నియమం ప్రకారం ఆయన వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ స్థానంలో ప్రియాంక పోటీకి దిగుతున్నారు. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఇప్పటివరకు ఏ స్థానంలోనూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌పై అభిమానం చూపుతున్న వయనాడ్‌లో ఆమె తొలిసారి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్‌లో సీట్ల పంపకంపై విభేదాల కారణంగా మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీలోకి దిగారు. అయితే, ఈ రెండు పార్టీలు జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా కలిసి పనిచేశాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మమత మాట్లాడుతూ ఇండియా కూటమికి తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) బయటినుంచే మద్దతిస్తుందని పేర్కొన్నారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని