ఇక దీదీ అక్కడ ప్రచారంలో పాల్గొనరు: డెరెక్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించబోయే తదుపరి ర్యాలీల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొనబోరని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రీన్‌ తెలిపారు.

Published : 19 Apr 2021 09:21 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించబోయే తదుపరి ర్యాలీల్లో సీఎం మమతా బెనర్జీ పాల్గొనబోరని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రీన్‌ తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్‌ 26న మాత్రమే కోల్‌కతాలో ఆమె ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు.

‘పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇకముందు కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీల్లో మమతా బెనర్జీ పాల్గొనరు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఏప్రిల్‌ 26న మాత్రం ముగింపు సమావేశం నిర్వహిస్తారు. ఇతర జిల్లాల్లో ఆమె పాల్గొనబోయే అన్ని ఎన్నికల ర్యాలీల సమయాన్ని 30 నిమిషాలకు కుదించారు’ అని డెరెక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌లో ఇటీవల కరోనా కేసుల ఉద్ధృతి పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6.59లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 8,419 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల భారీ రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని మిగిలిన మూడు దశల పోలింగ్‌ను కలిపి ఒకే సారి నిర్వహించాలని టీఎంసీ ఈసీని కోరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని