Published : 03 May 2021 01:16 IST

తాను ఓడినా.. పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన దీదీ! 

బెంగాల్‌లో టీఎంసీ హ్యాట్రిక్‌ విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూసిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం సృష్టించింది. టీఎంసీ, భాజపా మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ రసవత్తర పోరులో 213 స్థానాలను దక్కించుకొని అదిరిపోయే విజయం అందుకొంది. ఈ ఎన్నికల్లో వీల్‌ చైర్‌ నుంచే చక్రం తిప్పిన దీదీ.. నందిగ్రామ్‌లో తాను ఓడినా పార్టీకి చారిత్రక గెలుపు అందించడంలో మాత్రం గొప్ప విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానమైన భవానీపూర్‌ను వదులుకొని ఈసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగి ప్రత్యర్థులకు సవాల్‌ విసిరిన ఆమె.. అక్కడి నుంచి స్వల్ప తేడాతోనే ఓడినా పార్టీని మాత్రం ఒంటిచేత్తో గెలిపించారు.  మోదీ, అమిత్‌ షా ఇచ్చిన అభివృద్ధి నినాదం దీదీ చరిష్మా ముందు నిలబడలేకపోయింది. గతంలో 3 సీట్లు సాధించిన భాజపా ఈసారి భారీగా పుంజుకుంది. దాదాపు 74 సీట్లు గెలుపొంది మంచి విజయమే సాధించింది. ఇక కాంగ్రెస్‌-లెఫ్ట్‌-ఐఎస్‌ఎఫ్‌ కూటమి ఎలాంటి ప్రభావం చూపలేక చతికిలపడింది.  

నందిగ్రామ్‌లో హోరాహోరీ..
బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలన్న కమలనాథుల కలలను కల్లలు చేస్తూ దీదీ హ్యాట్రిక్‌ విజయం అందుకోవడం సామాన్య విషయమేమీకాదు. ఎన్నికల ఫలితాలు వన్‌సైడ్‌ గానే వచ్చినప్పటికీ భాజపా గట్టిపోటీ ఇచ్చి దీదీకి ముచ్చెమటలు పట్టించింది. నందిగ్రామ్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు కేవలం 1,736 ఓట్ల తేడాతో ఒకప్పుడు తృణమూల్‌లో నంబర్‌ 2గా ఉన్న ప్రస్తుత భాజపా అభ్యర్థి సువేందు అధికారి చేతిలో దీదీ ఓటమిపాలయ్యారు.

నమ్మిన వ్యక్తులు పార్టీ వీడినా..!
ఎన్నికలకు ముందు దీదీకి సన్నిహితులైన సువేందు అధికారి, ముకుల్‌ రాయ్‌లాంటి నేతలు, నమ్మిన వ్యక్తులు ఎదురు తిరిగినా ఆమె ఏమాత్రం చలించలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొందరు మంత్రులు, కీలక నేతలు సైతం పార్టీకి దూరమై ప్రత్యర్థి పార్టీలో చేరినా మమత ధైర్యం కోల్పోలేదు. పైగా ఇంకెవరైనా పార్టీలోంచి వెళ్లిపోవాలనుకుంటే ఇప్పుడే పోండి అంటూ వ్యాఖ్యానించడం కూడా ఆమె మొండితనానికి నిదర్శనం. ఈ ఎన్నికల్లో 114 మంది కొత్త ముఖాలకే సీట్లు ఇచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనే వ్యూహంతో ముందుకెళ్లారు. ఎనిమిది దశల్లో ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించి అనేక మంది సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చారు. కొత్త అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. నందిగ్రామ్‌లో చోటుచేసుకున్న ఘటనలో తన కాలికి గాయమైనా సరే ఏమాత్రం వెనక్కి తగ్గని దీదీ.. చక్రాల కుర్చీ నుంచే చక్రం తిప్పారు. కాలికి బలపం కట్టుకొని ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషిచేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ విధానాలపై విమర్శల దాడి చేశారు. తమ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీ అమలుచేయబోమని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం ద్వారా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు దీదీ. అంతా తానై ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా శక్తియుక్తులను ఉపయోగించినా.. పార్టీ కీలక నేతలను తనవైపు తిప్పుకొన్నా.. ముఖ్య అనుచరులపై సీబీఐ, ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసినా.. హింస పేరిట పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించినా అన్నింటినీ సాహసోపేతంగా ఎదురొడ్డి నిలిచి పార్టీకి చారిత్రక విజయాన్ని అందించారు. 

రాజకీయ చతురతతో పీఠం పదిలం..

34 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన వామపక్షకూటమి కంచుకోటలను బద్దలు కొట్టిన దీదీకి రాజకీయ సవాళ్లు కొత్తేం కాదు. కమ్యూనిస్టులను ఓడించి 2011లో తొలిసారి బెంగాల్‌ పీఠాన్నిదక్కించుకున్నమమత ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2011లో  తృణమూల్‌ కాంగ్రెస్‌కు 184 సీట్లు రాగా.. 2016లో  211 సీట్లు వచ్చాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 44.19 శాతం ఓట్లు సాధించింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభంజనం కొనసాగడంతో దీదీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గాను కేవలం 22 లోక్‌సభ స్థానాలకే పరిమితమైపోయింది. ఓట్లు కూడా 43.3%కి పడిపోయింది. ఈ ఎన్నికల్లో భాజపా 18 ఎంపీ స్థానాలు, 40శాతానికి పైగా ఓట్లు సాధించడంతో తృణమూల్‌ పునాదులు కదలడం మొదలైంది. తమకు ఓట్లు, సీట్లు తగ్గడంతో దీదీ అప్రమత్తమయ్యారు. 2019లో వచ్చిన ఫలితాలు టానిక్‌లా పనిచేయడంతో రెట్టింపు ఉత్సాహంతో కమలనాథులు దీదీని ఓడించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం శర్వశక్తులూ ధారపోశారు. బెంగాల్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో దీదీకి కంటిమీద కునుకులేకుండా చేశారు. అయినా, భాజపా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ అధికార పీఠాన్ని కాపాడుకోగలగడంలో దీదీ తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయం దిశగా దూసుకెళ్లారు. 

మార్పు నినాదంపై ‘లోకల్‌’ అస్త్రం
దేశంలో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌ దీదీకి మేలు చేసిందనే చెప్పాలి. ప్రజల నాడిని పసిగట్టి అందుకనుగుణంగా దీదీని అప్రమత్తంచేయడంలో ఆయన బృందం సఫలీకృతమైంది. దీంతో భాజపా ఎన్ని వ్యూహాలు రచించినా ప్రజాభిప్రాయాన్నిముందే పసిగట్టేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ సేవలు దీదీకి సహకరించాయి. దీనికితోడు తమ పార్టీలో అనేకమంది సీనియర్‌ నేతలు వెళ్లిపోవడంతో దీదీ గ్లామర్‌ కార్డు ప్లే చేశారు. పలువురు సినీ తారలను రంగంలోకి దించడంతో కమలనాథులు కూడా అదే బాటలో మిథున్‌ చక్రవర్తి వంటి వారిని రంగంలోకి దించినా భాజపాకు ఆశించిన ఫలితం లేకపోయింది. మార్పు నినాదంతో బరిలోకి దిగిన భాజపాపై.. దీదీ లోకల్‌ అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. బయటి నుంచి వచ్చే వ్యక్తులను నమ్మొద్దంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. భాజపా అధికారంలోకి వస్తే బెంగాల్‌ మరో గుజరాత్‌ అవుతుందంటూ వ్యాఖ్యానించారు. తద్వారా భాజపా సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని కూడా ఆమె పదునైన అస్త్రంగా వాడుకొని తన గెలుపునకు ఓ సోపానంగా మలచుకున్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారిని తనవైపు ఆకట్టుకొనేందుకు 50మంది మహిళా అభ్యర్థుల్ని రంగంలోకి దించారు.

భాజపాకు అందుకే ఎదురు గాలి..!

తనపై భాజపా చేసిన విమర్శల దాడిని తిప్పికొడుతూనే ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు దీదీ. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత అక్కడ భాజపా బలీయంగా కనబడినప్పటికీ పెట్రోల్‌ , డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపు ఆ పార్టీకి ఎదురు గాలిలా కనబడుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కరోనా కట్టడిలో వైఫల్యం చెందడం కూడా మరో కారణమని విశ్లేషిస్తున్నారు. బెంగాల్‌లో నిరుద్యోగం విషయంలోనూ భాజపా వ్యూహాలకు దీదీ చెక్‌ పెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని భాజపా ప్రచారం చేయగా.. మరోసారి తనకు అధికారమిస్తే ఏటా ఐదు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని దీదీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం విశేషం. అలాగే, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఐఎస్‌ఎఫ్‌ నేత అబ్బాస్‌ సిద్ధిఖీ రంగ ప్రవేశంతో బిహార్‌ తరహాలో మైనార్టీ ఓట్లు చీలుతాయని భాజపా పెట్టుకున్న ఆశలు అడియాశలే అయ్యాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మమత గాయపడటం కూడా ఆమెకు కలిసొచ్చినట్టే కనబడుతోంది. కేవలం సానుభూతి కోసమే ఇలాంటి డ్రామాకు తెరలేపారని భాజపా నేతలు అవహేళన చేయడం ఆమెకు లాభించినట్టు అర్థమవుతోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts