New Front: నవీన్‌ పట్నాయక్‌తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?

2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త ఫ్రంట్‌ (New Front) ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీల సీఎంలతో పశ్చిమ బెంగాల్‌ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

Published : 23 Mar 2023 23:35 IST

భువనేశ్వర్‌: భాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్ని కలిసి కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశా (Odisha) పర్యటనలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee).. బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik)తో భేటీ అయ్యారు. 2024లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు మమత ప్రాంతీయ పార్టీల కూటమికి నవీన్‌ పట్నాయక్‌ మద్దతు కోరినట్లు సమాచారం. అయితే, దీన్ని ఇరువురు సీఎంలు కొట్టిపారేశారు. 

ఈ భేటీ అనంతరం నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ‘‘ దేశ సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధానంపై ఇరువురం చర్చించాం. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. రాజకీయపరమైన అంశాల గురించి మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు’’ అని తెలిపారు. మమతా బెనర్జీ సైతం ఇది కేవలం సాధారణ భేటీ మాత్రమేనని, దీని వెనుక ఎలాంటి రాజకీయపరమైన ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. 

కొద్ది రోజుల క్రితం కొత్త ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సమావేశమైన సంగతి తెలిసిందే.  ఈ భేటీలో భాజపాతో పాటు కాంగ్రెస్‌కు కూడా సమదూరం పాటించాలని రెండు పార్టీల అధ్యక్షులు నిర్ణయించారు. మరోవైపు కొత్త ఫ్రంట్‌ గురించి చర్చించేందుకు శుక్రవారం మమతతో జేడీయూ నేత కుమారస్వామి కోల్‌కతాలో సమావేశం కానున్నారు.

మరోవైపు భాజపాకు వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికలల్లో కూటమిపై చర్చించేందుకు రావాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భాజపాయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు.  ‘ప్రొగ్రెసివ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఆయన ఈ విందు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఈ భేటీకి ఒక్కరు కూడా రాకపోడం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల కారణంగా ప్రాంతీయ పార్టీల ప్రతిపక్ష సీఎంలు కేజ్రీవాల్‌ నిర్వహించిన భేటీకి హాజరుకాలేకపోయారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని