ఉప ఎన్నిలకు TMC అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల జరగబోయే ఉప ఎన్నికలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

Updated : 14 Mar 2022 04:50 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల జరగబోయే ఉప ఎన్నికలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సీనియర్‌ నేత శత్రుఘ్న సిన్హాను, బాలీగుంగే అసెంబ్లీ స్థానానికి బాబుల్‌ సుప్రియో పేర్లను తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం ప్రకటించారు. వీరిద్దరూ గతంలో భాజపా నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసిన వారే కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 12న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం ప్రకటన వెలువరించింది. దీంతో మమతా బెనర్జీ అభ్యర్థులను ఖరారు చేశారు. బాబుల్‌ సుప్రియో రాజీనామాతో ఖాళీ ఏర్పడిన అసన్‌సోల్‌ నుంచి శత్రుఘ్న సిన్హాను బరిలో నిలుపుతున్నట్లు మమత ప్రకటించారు. అలాగే, రాష్ట్ర మంత్రి సుభత్రా ముఖర్జీ మరణంతో ఖాళీ ఏర్పడిన స్థానానికి బాబుల్‌ సుప్రియో పేరును మమత ఖరారు చేశారు. శత్రుఘ్న సిన్హా గతంలో భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు బాబుల్‌ సుప్రియో భాజపాను వీడి టీఎంసీ కండువా కప్పుకొన్నారు.

వడ్డీ తగ్గింపు.. రిటర్న్‌ గిఫ్టా: మమత

పీఎఫ్‌ వడ్డీ రేటు తగ్గించడాన్ని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం కట్టబెట్టినందుకు రిటర్న్‌ గిఫ్టా అని ప్రశ్నించారు. దీన్ని ప్రజావ్యతిరేక చర్యగా అభివర్ణించారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజే వడ్డీ రేట్లు తగ్గించి భాజపా తన ముసుగును బయటపెట్టిందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని