Mamata: అందుకే రోజూ పెట్రో వాత.. కేంద్రంపై దీదీ ఫైర్‌

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంపై బెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.....

Published : 05 Apr 2022 02:08 IST

అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్‌

కోల్‌కతా: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతుండటంపై బెంగాల్ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇంధన ధరలు ఆకాశాన్నంటడానికి బాధ్యత భాజపాదేనన్నారు. ఈ సంక్షోభాన్ని నిలువరించాలనే ఆలోచనే కేంద్ర ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని కనుగొనేందుకు కేంద్రం అఖిపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని పెంచుతున్నారు. ఇంధన ధరల పెరుగుదలను ఎదుర్కొనే ఆలోచనే కేంద్రానికి లేదు. ఈ సంక్షోభానికి భాజపానే బాధ్యత వహించాలి. యూపీ ఎన్నికల్లో విజయం చేకూర్చినందుకు ఇది మీరిచ్చే రిటర్న్‌ గిఫ్టా? ప్రతిపక్ష పార్టీలపై సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల్ని ప్రయోగించే బదులు ఆర్థిక సమస్యల్ని పరిష్కరించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించండి’’ అని కేంద్రానికి దీదీ సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని