అందువల్లే అక్కడ హింస!

మమతా బెనర్జీ ప్రేరేపించడం వల్లే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Published : 12 Apr 2021 01:24 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపణ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ అధినేత్రి, మమతా బెనర్జీ ప్రేరేపించడం వల్లే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. కేంద్ర బలగాలను ముట్టడి చేయాలని మమతా బెనర్జీ పిలుపునివ్వడం వల్లే కోచ్‌బిహర్‌లో హింస చోటుచేసుకుందన్నారు. కేంద్ర బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమతా బెనర్జీ వాడుకుంటున్నారని అమిత్‌ షా దుయ్యబట్టారు.

‘కేంద్ర బలగాలను ఘెరావ్‌ చేయాలని మమతా బెనర్జీ  ప్రజలకు సూచించారు. సితాల్‌కుచిలో చోటుచేసుకున్న హింసకు అది కారణం కాదా? దీదీ చేసిన సూచనలే సీఐఎస్‌ఎఫ్‌ బలగాలపై దాడి చేయడానికి పురిగొలిపాయి’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. నదియా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్‌ షా..  హింసలో మరణించిన వారిని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరుగనున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా చూడాలని.. ఇందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాజకీయ పార్టీలకు అమిత్‌ షా విజ్ఞప్తిచేశారు.

ఇక నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్‌ 10వ తేదీన పోలింగ్‌ సమయంలో బెంగాల్‌లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కోచ్‌బిహార్‌ జిల్లాలోని సితాల్‌కుచి నియోజక పరిధిలో ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఇదే నియోజకవర్గంలో మరో ఓటరుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎన్నికల ముందు ప్రచార సమయంలోనూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై ఇదే నియోజకవర్గంలో రాళ్లదాడి జరిగింది.  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని భాజపా ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని