Mamata Banerjee: దుర్గామాతగా మమత విగ్రహాలు.. భాజపా ఫైర్‌!

పశ్చిమ బెంగాల్లో రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించడం వివాదానికి తావిచ్చింది.

Published : 04 Sep 2021 01:15 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గా మండపాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విగ్రహాలను ప్రతిష్ఠించాలని కొందరు నిర్వాహకులు నిర్ణయించడం వివాదానికి తావిచ్చింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ప్రతిపక్ష భాజపా మండిపడుతోంది.

నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిష్ఠించేందుకు ప్రముఖ శిల్పి మింటు పాల్‌ మమత విగ్రహాలను రూపొందిస్తున్నారు. మమత ఆహార్యానికి దగ్గర ఉండేలా తెలుపు రంగు చీరతో కూడిన విగ్రహాన్ని తయారుచేస్తున్న చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. దుర్గామాత ప్రతిరూపంగా ఆమెకు పది చేతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయుధాలకు బదులుగా ప్రజాదరణ పొందిన పథకాలను ప్రతిబింబించేలా విగ్రహాలను రూపొందిస్తున్నారు. మమత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రజలకు మరింత తెలియజేయాలనే లక్ష్యంతో తాను ఈ విగ్రహాలను రూపొందిస్తున్నానని, ఇందుకోసం ఆమె ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పుకొచ్చారాయన.

విగ్రహాల ప్రతిష్ఠించాలన్న నిర్ణయాన్ని ప్రతిపక్ష భాజపా ఖండించింది. ఎన్నికల అనంతరం హింసకు పాల్పడుతున్న వ్యక్తిని దేవతగా చిత్రీకరించడాన్ని తప్పుబట్టింది. దుర్గామాతను, హిందువుల మనోభావాలను అవమానించడమేనని ఆ పార్టీ ఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాళవీయ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించకపోవడమంటే విగ్రహ ఏర్పాటుకు మమత అంగీకరిస్తున్నట్లేనని, దీనిబట్టి దీదీ అహం తారస్థాయికి చేరుకుందనేది అర్థమవుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని