Gujarat Assembly Polls: ప్రసంగానికి కార్యకర్త అంతరాయం..రాహుల్‌ ఏం చేశారంటే..!

గుజరాత్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తుండగా..మధ్యలో ఓ కార్యకర్త అంతరాయం కలిగించాడు. గుజరాతీలో తర్జుమా చేయాల్సిన పనిలేదని, హిందీలోనే కొనసాగించాలని కోరాడు. దీంతో రాహుల్‌ అనువాదం చేస్తున్న వ్యక్తి పంపించేసి ప్రసంగం కొనసాగించారు.

Updated : 08 Dec 2022 19:10 IST

సూరత్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సూరత్‌లో పర్యటిస్తున్నారు.  మహువాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ ప్రసంగిస్తుండగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రసంగాన్ని ఆయన హిందీలో ప్రారంభించగా..మరొక నేత గుజరాతీ భాషలో అనువాదం చేస్తున్నారు. ఇలా దాదాపు 13 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత గ్యాలరీలో ఉన్న ఓ కార్యకర్త అరవడం మొదలు పెట్టాడు. అందరికీ హిందీ అర్థమవుతుందని, గుజరాతీలో తర్జుమా చేయాల్సిన అవసరం లేదని, ప్రసంగాన్ని కొనసాగించాలని కోరాడు. దీంతో రాహుల్‌ తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపి.. ‘ మీ అందరికీ హిందీ ఓకే అయితే.. నాకూ ఓకే’ హిందీలోనే కొనసాగిస్తానంటూ..అక్కడనున్న అనువాదకుడ్ని పంపించేశాడు. భారత్‌ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ.. దానికి తాత్కాలిక బ్రేక్‌ ఇచ్చి.. ఇవాళ్టి నుంచి గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఆదివాసీలను రాహుల్‌గాంధీ దేశానికి మొదటి యజమానులుగా అభివర్ణించారు. అలాంటిది భాజపా ప్రభుత్వం వారిని పక్కన పెట్టేసిందని విమర్శించారు.‘‘ భారతదేశానికి ఆదివాసీలే మొదటి యజమానులన్న సంగతి భాజపా వాళ్లు మర్చిపోయారు. మిమ్మల్ని వనవాసీలు అని పిలుస్తున్నారు. మీరంతా అడవుల్లోనే ఉండాలట. మీరు పట్టణాల్లో ఉండాలని ఆ పార్టీ కోరుకోవడం లేదు. మీ పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు కావడం వాళ్లకి ఇష్టం లేదు.’’ అని రాహుల్‌ విమర్శించారు.

మరోవైపు పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. తమ పార్టీకి చెందిన కీలక నేతలందర్నీ రాష్ట్రంలో మోహరించాయి. భాజపా తరఫున ప్రధాని మోదీ, అమిత్‌షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితర హేమాహేమీలంతా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, మోదీ పాలనే ప్రచార అస్త్రాలుగా భాజపా బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ.. ఒక్కసారి అవకాశమివ్వాలంటూ తొలిసారి పూర్తిస్థాయిలో ఎన్నికల్లో పాల్గొన్న ఆప్‌ ప్రజల్లోకి దూసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్, భాజపా కుమ్మక్కయ్యాయని అందుకే కాంగ్రెస్‌ నేతలపై దాడులు నిలిచిపోయాయని ఆప్‌ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కీలక ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.అందుకే గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని