Mandava VenkateswaraRao: ముఖ్యమంత్రి గారూ విజ్ఞత ప్రదర్శించండి: మాజీ మంత్రి మండవ

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చడంపై మాజీ మంత్రి

Updated : 29 Sep 2022 06:36 IST

హైదరాబాద్‌: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చడంపై మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల అభ్యున్నతే పరమావధిగా ఎన్టీఆర్‌ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈమేరకు ఏపీ సీఎం జగన్‌కు మండవ లేఖ రాశారు.

‘‘ఏపీ సీఎం జగన్‌కు ఇలాంటి లేఖ రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఇటీవల మీరు డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్పు చేస్తూ తీసుకొన్న నిర్ణయంపై ఆవేదన, బాధను వ్యక్తం చేయడానికి ఈ లేఖ రాస్తున్నా. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎంతోమంది గొప్ప నాయకుల్ని చూశాను. రాజకీయ పరమైన విభేదాలు ఎన్ని ఉన్నప్పటికీ  పరస్పరం గౌరవించుకోవడం, ఎవరి సిద్ధాంతాలు, విధానాలు వారు అనుసరించుకోవడానికి అనువైన వాతావరణం కల్పించేవారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉండగానే.. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్‌, జలగం వెంగళరావు పార్క్‌, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఆయన విగ్రహం, కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుచేసి మాజీ ముఖ్యమంత్రులకు గౌరవం కల్పించాం. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెరాస సైతం ఈ పేర్లను మార్చకపోవడం గమనార్హం. 

పేరు మార్పుతో విద్యార్థులకు ఎన్నో సమస్యలు..

తెలంగాణ ఉద్యమం సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ప్రముఖుల విగ్రహాలు ధ్వంసమైనప్పటికీ తిరిగి వాటిని పునరుద్ధరించి ఆ మహనీయుల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడారు. హఠాత్తుగా మీరు హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించడం యావత్‌ తెలుగు సమాజాన్ని నివ్వెరపర్చింది. ఇందుకు మీరు ఎన్ని కారణాలు చెప్పినా ప్రజల్ని సంతృప్తి పర్చలేరు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపుతో అత్యున్నత సంప్రదాయాలను కాలరాసినట్లయింది. మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయం పర్యవసానాలు సమాజంలో విపరీత పరిణామాలకు దారితీస్తాయి. పేరు మార్పు వల్ల వర్సిటీ విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒకరు పునాది వేస్తారు. వేరొకరు మొదలుపెడతారు. ఇంకొకరు దానిని ప్రారంభిస్తారు. ప్రభుత్వం అన్నది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విజ్ఞత ప్రదర్శించి హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించిన ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించండి’’ అని మండవ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని