Sumalatha: భాజపాకే నా సంపూర్ణ మద్దతు.. క్లారిటీ ఇచ్చేసిన సుమలత
త్వరలో భాజపా(BJP)లో చేరబోతున్నారంటూ వచ్చిన రూమర్లపై సినీనటి, మాండ్య ఎంపీ సుమలత(Sumalatha) క్లారిటీ ఇచ్చేశారు. తన పూర్తి మద్దతు భాజపాకేనని ప్రకటించారు.
మాండ్య: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాజపాలో చేరికపై వచ్చిన ఊహాగానాలపై సినీనటి, మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్(Sumalatha Ambareesh) క్లారిటీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు-బెంగళూరు మధ్య నిర్మించిన 10 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు వస్తున్న తరుణంలో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకే తన పూర్తి మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల తాను భాజపాలో ఇప్పుడు చేరడంలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసంతోనే తన శ్రేయోభిలాషులు, మద్దతుదారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. శుక్రవారం మాండ్యలోని తన నివాసంలో సుమలత మీడియాతో మాట్లాడారు.
భాజపాకు నా మద్దతు అందుకే..
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన పాలన కొనసాగుతుండటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత కీర్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని తాను ఆ పార్టీకే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తన కొడుకు భవిష్యత్తు కోసం కాదని.. మాండ్య జిల్లాలో మార్పు తీసుకొచ్చి, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకేనని చెప్పారు. కాలుష్యంలేని స్వచ్ఛ మాండ్యనే తన లక్ష్యమన్నారు. ప్రధాని మోదీ భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీడర్ అని సుమలత కొనియాడారు.
డబ్బు, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు..
తాను డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రాలేదని.. ఇప్పటికే తమకు అవి ఉన్నాయన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తనను మాండ్య ప్రజలు ఆదరించారని చెప్పారు. జిల్లాలో కొందరు నేతల నుంచి తాను అనేక అవమానాలు, వేధింపులకు గురయ్యానని ఈ సందర్భంగా సుమలత వెల్లడించారు. కానీ ఆ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. కానీ తనకు బహిరంగ సభలను నిర్వహించడంలో అడ్డంకులు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా మద్దతు అవసరమని గ్రహించినట్టు చెప్పారు.
మోదీ రాక.. మాండ్యకు గౌరవం!
మోదీ నాయకత్వంపై తమకు విశ్వాసం ఉందని సుమలత అన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం కోసం ఆయన మాండ్యకు రావడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందకు ప్రధాని బెంగళూరు లేదా మైసూరును ఎంచుకోవచ్చు.. కానీ ఆయన మాండ్యకే రావడమంటే ఈ జిల్లాకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుందన్నారు. మండ్యాను తమకు రాజకీయ కోటగా మలుచుకున్న వారు జిల్లాకు చేసిందేమీ లేదని జేడీఎస్‌పై విమర్శలు గుప్పించారు. మాండ్యలో మార్పు రావాలని, ఇక్కడి కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు.
నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం నా కుమారుడి ఎంట్రీ ఉండదు!
గత లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతకు భాజపా సహకరించింది. దీంతో ఇక్కడ జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను ఓడించి సుమలత గెలుపొందారు. అయితే, సుమలత దాదాపు ఏడాదిగా భాజపా నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని సమాచారం. కానీ, గత కొన్ని రోజులుగా ఆమెతో భాజపా నేతలు వివిధ దఫాలుగా చర్చలు జరుపుతుండటంతో ఆమె భాజపాలో చేరడంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుమలత గురువారం సమావేశమై చర్చలు జరపడంతో ఆమె భాజపాలో చేరిక ఖాయమేనన్న ప్రచారం జరిగింది. అయితే, ఆమె ఎలాంటి షరతులపై కాషాయ దళంలో చేరబోతున్నారనే చర్చ జోరందుకుంది. ఇందులో భాగంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న సీటును నుంచి తన కుమారుడు అభిషేక్‌కు టిక్కెట్ ఇప్పిస్తారని, అలాగే, ఆమె కూడా బెంగళూరు నుంచి పోటీ చేయబోతున్నారంటూ వచ్చిన ఊహాగానాలకు ఆమె ఈరోజు క్లారిటీ ఇచ్చేశారు. ఆ రూమర్లను కొట్టిపారేసిన సుమలత.. తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు తన తనయుడు ఈ రంగంలో అడుగు పెట్టరని హామీ ఇచ్చారు. ఇతర పార్టీల నేతల్లా తాను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించబోనన్నారు. ‘అంబరీశ్ బతికి ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఈ రంగంలో ఉన్నంత వరకు నా కుమారుడు రాజకీయాల్లోకి రాడు. నేను మాండ్యా అభివృద్ధికే కట్టుబడి ఉంటాను. ఇక్కడి నుంచి మరో సీటుకు వెళ్లే ప్రసక్తే లేదు. మాండ్యను వదిలి వెళ్లడానికి బదులు ఈ లోకాన్ని వీడటానికే నేను ఇష్టపడతా’’ అని సుమలత వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Bengaluru: యువతిపై ఘోరం.. కారులోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం!
-
Movies News
Social Look: ముంబయిలో మెరిసిన శోభిత.. నైనా ‘కాఫీ’ కప్పు!
-
India News
Delhi Liquor Scam: మనీశ్ సిసోదియాకు బెయిల్ నిరాకరణ
-
Sports News
Ravindra jadeja: సీఎస్కేకు మద్దతు ఇవ్వండి.. గుజరాత్ అభిమానులకు జడేజా విజ్ఞప్తి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Education News
TS Eamcet: తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు.. కొత్త తేదీలివే!