Tripura: వీడిన ఉత్కంఠ.. మాణిక్‌ సాహాకే త్రిపుర పగ్గాలు

త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా కొనసాగనున్నారు. సీఎం పదవి విషయంలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌ పేరు కూడా వార్తల్లోకి రాగా.. నేడు భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

Published : 06 Mar 2023 23:45 IST

అగర్తలా: త్రిపుర(Tripura) ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కనుందనే అంశంపై ఉత్కంఠ వీడింది. మాణిక్‌ సాహా(Manik Saha)నే మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించనున్నారు. నూతనంగా ఎన్నికయిన భాజపా ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా(BJP) 32 సీట్లు కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మిత్రపక్షం ఐపీఎఫ్‌టీ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది.

అయితే, సీఎం అభ్యర్థికి సంబంధించి మాణిక్‌ సాహా పట్ల ఒక వర్గం సానుకూలత వ్యక్తం చేయగా.. మాజీ సీఎం బిప్లవ్‌ దేబ్‌ మద్దతుదారులున్న మరో వర్గం కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్‌(Pratima Bhowmik)ను పదవి వరిస్తుందని భావించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠకు తెరలేపింది. అయితే, వివాద రహితుడిగా పేరు పొందడం, దీంతోపాటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకతను చల్లార్చేందుకుగానూ భాజపా కేంద్ర నాయకత్వం మొదటినుంచి సాహా పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి ఆయనకు అధికార పగ్గాలు దక్కాయి.

బిప్లవ్‌ దేబ్‌ స్థానంలో సాహా గతేడాది మార్చి 14న త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తాజా నిర్ణయంతో సాహా వరుసగా రెండోసారి త్రిపుర ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు నడ్డా తదితరులు హాజరుకానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని