Manish Tewari: భారత్‌, కాంగ్రెస్‌ మధ్య దూరం పెరిగినట్లుంది.. మనీశ్ తివారీ వ్యాఖ్యలు

శతాధిక పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర కష్టాల్లో ఉంది. వరుస ఓటములు, రాజీనామాలతో ఇబ్బంది పడుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన నేపథ్యంలో..

Published : 27 Aug 2022 13:40 IST

దిల్లీ: శతాధిక పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర కష్టాల్లో ఉంది. వరుస ఓటములు, రాజీనామాలతో ఇబ్బంది పడుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన నేపథ్యంలో..  ఆ పార్టీ నేత మనీశ్ తివారీ స్పందించారు. పార్టీలో ఆత్మ పరిశీలన అవసరం అని.. భారతావనికి, కాంగ్రెస్‌కు మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

‘రెండేళ్ల క్రితం మేం 23 మంది సోనియా గాంధీకి లేఖ రాశాం. పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందనీ.. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలనీ దానిలో పేర్కొన్నాం. ఆ లేఖ తర్వాత కాంగ్రెస్ అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 1885 నుంచి ఉన్న ఈ పార్టీకి.. భారతావనికి మధ్య చీలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఆత్మ పరిశీలన అవసరం. డిసెంబర్, 2020న సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని నా నమ్మకం’అని తివారీ స్పందించారు.

అలాగే కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామా అంశంపై స్పందించేందుకు తివారీ నిరాకరించారు. అయితే వార్డు ఎన్నికల్లో కూడా పోటీ పడే సామర్థ్యం లేనివారు.. ఇలా జ్ఞానాన్ని పంచడం నవ్వు తెప్పిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక,తాను దశాబ్దాలుగా పార్టీతో మమేకమై ఉన్నానని, తన గురించి ఎవరు సర్టిఫికేట్‌ ఇవ్వాల్సిన పని లేదన్నారు.

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన గులాంనబీ ఆజాద్‌ చివరికి నిన్న రాజీనామా చేశారు. అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన ఆయన.. తాను పార్టీని వీడడానికి రాహుల్‌ గాంధీ తీరు ఓ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉన్నప్పటికీ.. రాహుల్‌ గాంధీ అనుచరులే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని దుయ్యబట్టారు. రాజీనామా లేఖలో రాహుల్‌ గాంధీ తీరును ఆజాద్‌ ప్రధానంగా ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని