Mamata Banerjee: మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించకపోతే..: కేంద్రానికి దీదీ హెచ్చరిక!

తమకు ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్‌ చేయకపోతే జీఎస్టీ(GST) చెల్లింపులు నిలిపేయాల్సి ఉంటుందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కేంద్రానికి హెచ్చరించారు.

Published : 16 Nov 2022 01:51 IST

ఝార్‌గ్రాం: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. తమ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల్ని(Dues) భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చెల్లించడంలేదని మండిపడ్డారు. బెంగాల్‌కు ఇవ్వాల్సిన బకాయిలు క్లియర్‌ చేయకపోతే జీఎస్టీ(GST) చెల్లింపులు నిలిపేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. గిరిజన జనాభా అధికంగా ఉండే ఝార్‌గ్రామ్‌ జిల్లాలో దీదీ పర్యటించారు.  భగవాన్‌ బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న దీదీ.. ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గిరిజనులతో కలిసి సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. తమకు కేంద్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి.. లేదంటే అధికారం నుంచి వైదొలగాలన్నారు.

నరేగా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడంలేదని.. దీన్ని నిరసిస్తూ గిరిజనులు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని దీదీ విజ్ఞప్తి చేశారు. ‘‘మా బకాయిల్ని చెల్లించండి అంటూ కేంద్రాన్ని అడుక్కోవాలా? వాళ్లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం(నరేగా) నిధుల్ని విడుదల చేయడంలేదు. మా బకాయిల్ని చెల్లించకపోతే భాజపా ప్రభుత్వం అధికారం నుంచి వైదొలగాలి’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని