Updated : 10 Apr 2022 15:21 IST

Mayawati: రాహుల్‌జీ.. ముందు సొంతింటిని చక్కబెట్టుకోండి: మాయావతి

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామన్న ప్రతిపాదనను కాంగ్రెస్‌ పంపితే దానిపై తాను కనీసం మాట్లాడలేదన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను బీఎస్పీ అధినేత్రి మాయావతి తిప్పికొట్టారు. ‘‘సొంత ఇంటిని చక్కబెట్టుకోలేని రాహుల్‌ బీఎస్పీపై విమర్శలు చేస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు. గాంధీ వ్యాఖ్యలన్నీ అబద్ధాలన్నారు. ముగిసిన ఎన్నికల గురించి కాకుండా ఓటమికి గల కారణాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. 

భారత్‌లో చైనా తరహాలో ఏకపార్టీ...

‘‘భాజపా, ఆరెస్సెస్‌ కలిసి భారత్‌ను కాంగ్రెస్‌ రహిత దేశంగానేగాక ప్రతిపక్ష రహితంగా మార్చేందుకు యత్నిస్తున్నాయి. చివరకు భారత్‌లో చైనా తరహాలో ఒకే ప్రధాన పార్టీ మనుగడలో ఉంటుంది. పార్లమెంటులో ప్రధానిని కౌగిలించుకునే రాహుల్‌ గాంధీ వంటి నేతలు ఉన్న పార్టీ కాదు మాది. ప్రపంచవ్యాప్తంగా అబాసుపాలవుతున్న పార్టీ కాదు మాది’’ అని ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ, పెగాసస్‌కు భయపడుతున్నారన్న వ్యాఖ్యలనూ మాయావతి తిప్పికొట్టారు. ‘‘గతంలో దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ సైతం ఇదే తరహాలో బీఎస్పీని అప్రతిష్ఠ పాల్జేసేందుకు ప్రయత్నించారు. దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నామని ప్రియాంక గాంధీ సైతం ఆరోపణలు చేస్తున్నారు. అవన్నీ నిజం కాదు. వీటన్నింటిపై సుప్రీంకోర్టులో పోరాడి గెలిచాం అని వారు తెలుసుకోవాలి’’ అని మాయావతి అన్నారు.

ఇవీ రాహుల్‌ వ్యాఖ్యలు..

దేశంలోని రాజకీయ వ్యవస్థలను సీబీఐ, ఈడీ, పెగాసస్‌లతో నియంత్రిస్తున్నారంటూ శనివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రంపై రాహుల్‌ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ అధినాయకురాలు మాయావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తామని తమ పార్టీ తరఫున ప్రతిపాదన పంపామని వెల్లడించారు. కలిసి పోటీ చేద్దామని సందేశం పంపితే ఆమె మాట్లాడలేదని అన్నారు. దీనికి కారణం.. సీబీఐ, ఈడీ, పెగాసస్‌లేనని తెలిపారు. వీటికి భయపడే ఆమె తమ ప్రతిపాదనకు స్పందించలేదన్నారు.

ఇరు పార్టీలకూ ఘోర పరాభవం..

ఇటీవల ముగిసిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని చవిచూసింది. 2017 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత ఈసారి సమాజ్‌వాదీ పార్టీ.. కాంగ్రెస్‌తో పొత్తుకు వెనుకాడింది. పైగా చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇది ఎస్పీకి లాభం చేకూర్చింది. చివరకు భాజపా విజయం సాధించినప్పటికీ.. ఎస్పీ రాణించడంలో కాంగ్రెస్‌ ఓట్లు బదిలీ కావడమే ముఖ్య కారణంగా రాజకీయ పండితులు ఫలితాలను విశ్లేషించారు. మొత్తం 403 స్థానాలకుగానూ కేవలం రెండు సీట్లను మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. కేవలం 2.5 శాతం ఓట్లు మాత్రమే కాంగ్రెస్‌కు పడడం గమనార్హం. 97 శాతం సీట్లలో అభ్యర్థులకు ధరావతు కూడా దక్కలేదు. బీఎస్పీ సైతం భారీ ఓటమిని చవిచూసింది. కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. 12 శాతం ఓట్లను సొంతం చేసుకుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని